బుద్దిసాగరుడు కూలీల చేత మంచె ఉన్న చోట తవ్వించాడు. కూలీలు తగినంత లోతు తవ్వారు. అద్భుతం! భారీ పరిమాణంలో ఉన్న బంగారు సింహాసనం బయటపడింది. మట్టి అంటుకుపోయినా దాని అందం అందర్నీ ఆకర్షిస్తోంది. లతలూ, పువ్వూలూ, చూడచక్కని శిల్పకళతో అలరారుతోంది. అచ్చమైన బంగారంతో, మరకత మాణిక్యాధి రత్నాలతో పొదిగి ఉంది. దానికి 32 విశాలమైన మెట్లున్నాయి. మెట్లపైన సింహాసనం కళ్ళు మిరమిట్లు గొల్పుతోంది. ప్రతీ మెట్టుకూ నిలువెత్తులో ఒకో సువర్ణ ప్రతిమ ఉంది. అందమైన అమ్మాయిల బొమ్మలు! అంతకంటే అందమైన వస్త్రాలూ, నగలూ ధరించినట్లుగా మలచబడిన శిల్పాలు! సువర్ణంతో చేసిన సౌందర్య రాశులు! చీర అంచుల్లో, నగల ధగధగల్లో, ధరించిన పువ్వుల్లో… ప్రతీ ఆకృతిలో, అందంగా ఒదిగిన వజ్రాలూ, కెంపులూ, మణులూ, మరకతాలు! అచ్చంగా అందమైన అమ్మాయిలు, విభిన్న భంగిమల్లో నిల్చున్నట్లున్నాయి. జుట్టు విరబోసుకున్నట్లు ఓ బొమ్మ ఉంటే, ముడి వేసుకుని పూలు ముడుచుకున్నట్లు మరో బొమ్మ! ఓ బొమ్మది వాలు జడ, మరో బొమ్మది పూల జడ! హొయలు కురిపిస్తూ, వయ్యారాలు ఒలికిస్తూ, విభిన్న భంగిమల్లో, జీవం ఉట్టిపడుతూ, అచ్చంగా రమణీయ రమణీమణులు మెట్టు మెట్టుపై నిలబడి నట్లుగా ఉన్న బంగారు బొమ్మలు! అది చూసిన అందరిలో ఆనందం పెల్లుబికింది. బుద్దిసాగరుడు సింహాసానాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ “ఇదన్నమాట సంగతి! ఈ సింహాసనం పూర్వం ఏ మహా చక్రవర్తిదో అయి ఉంటుంది. కాలగతిలో ఇక్కడ మట్టిలో కూరుకుపోయింది. కాబట్టే, ఈ చోటులో నిర్మించిన మంచె మీద ఉన్నంత సేపూ ఆ రైతు, ఈ సింహసనాన్ని గతంలో అధిష్టించిన మహానుభావుడి గొప్ప గుణాన్ని ప్రతిబింబిస్తూ, వితరణ శీలాన్ని చూపించాడు. మంచె దిగి రాగానే మామూలు మనిషిలా మాటలాడాడు. అదంతా ఈ సింహాసనపు విశిష్టతే!” అనుకున్నాడు. [బుద్దిసాగరుడి ఆలోచనా తీరు, పిల్లల్ని సహజంగానే ప్రభావితం చేస్తుంది. భోజరాజూ, బుద్దిసాగరుడూ, శరవణ భట్టు విచిత్ర ప్రవర్తన చూసి “ఏమోలే! వీడో తిక్కలోడు” అనుకోలేదు. దానికేదో కార్యకారణ సంబంధముండి ఉండాలని శోధించారు. శరవణ భట్టు వైరుధ్య ప్రవర్తనలని పట్టించుకోకుండా తమ దారిన తాము పోయి ఉన్నట్లేతే, వాళ్లకి ఇంత గొప్ప సింహాసనం లభించేది కాదు. ఈ కథలూ ఉండేవి కావు. ఇది గ్రహించినప్పుడు, పిల్లలు, తమ చుట్టూ జరిగే విషయాల పట్ల కూడా, ఒక కుతుహలాన్ని పెంపొందించుకుంటారు. కార్యకారణ సంబంధాల పట్ల విశేషణాత్మక దృష్టి కలిగి ఉంటారు. కథల వల్ల ప్రయోజనాలలో సౌశీల్య నిర్మాణం, వ్యక్తిత్వ వికాసమూ ప్రధానమైనవి. నిజానికి, శరవణ భట్టు చూపిన వితరణ గుణం అతడిది కాదు. విక్రమార్కుడి సింహాసనానిది. మనలోనూ… శరవణ భట్టు చూపినట్లు ‘శివాలు’ అప్పుడప్పుడూ కన్పిస్తుంటుంది. ఏదైనా పని విజయవంతంగా చేసినప్పుడు ఇక అన్ని పనులూ చేసేయగలం అనుకోవటం, ఇటువంటిదే! ఎవరైనా ప్రక్కనున్నప్పుడో, పనిరంధి లేదా అటువంటిదే ఏదైనా విభిన్నమైన [మూడ్] మనఃస్థితిలో ఉన్నప్పుడు “అదెంత లెండి! చేసేద్దాం!” అంటూ ఇతరులకి హామీలిచ్చేస్తుంటాం. తీరా ఆ హామీలు నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నొప్పి తెలుస్తుంటుంది. అలాంటి సందర్భాలలో మేము “భోజరాజు సింహాసనం ఎక్కి నప్పటి మాటలొద్దు” అనో లేదా “విక్రమార్క సింహసనం ఎక్కేసి శివాలెక్కించుకోవద్దు” అనో అనుకుంటూ, పరస్పర హెచ్చరికలు చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా మనస్సుని నియంత్రించుకో ప్రయత్నిస్తామన్న మాట. అందుకు మా short cut formula వంటి పద ప్రయోగం ‘భోజరాజ సింహాసనమా?/ విక్రమార్క సింహసనమా?’ ఇక కథలోకి వస్తే…] బుద్దిసాగరుడు సింహాసనాన్ని ధారా నగరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. భోజరాజు సింహాసనాన్ని చూసి ఆశ్చర్యం, ఆనందం పొందాడు. కూలీలకి, అక్కడ పనిచేసిన ఇతరులకి, భోజరాజు విలువైన బహుమతులు ఇచ్చాడు. సింహాసనాన్ని శుభ్రపరిచి, మెరుగులు దిద్దారు. స్వర్ణ సింహసనాన్ని భోజరాజు సభాభవనంలో ప్రతిష్ఠించారు. దాని పనితనాన్ని చూసి యావత్ర్పజానీకం నివ్వెర పోయింది. ‘అపూర్వం! అద్భుతం!’ అని అందరూ వేనోళ్ళ కొనియాడారు. భోజరాజు ఆస్థాన జ్యోతిష్యులని, పండితులని సంప్రదించాడు. వారి మార్గదర్శకత్వంలో మంచి ముహుర్తం నిర్ణయించారు. ఆ పుణ్య దినాన దైవపుజాదికాలు నిర్వహించారు. తదుపరి సింహాసనానికీ పూజ చేసి, హారతులు ఇచ్చారు. భోజరాజు, పండితుల, పురోహితుల, పెద్దల ఆశీర్వాదాలు పొంది, సింహాసనాన్ని సమీపించి నమస్కరించాడు. పండిత పురోహితుల వేదమంత్రాలతో సభాభవనం మార్మోగుతుంది. ప్రజలు విభ్రమాశ్చర్యానందాలతో చూస్తున్నారు. మంగళ వాద్యాలు మిన్నంటి మ్రోగుతున్నాయి. భోజరాజు సంతోషంగా, సింహాసనాధిష్టిత కాంక్షతో, సుతారంగా కుడిపాదం ఎత్తి, తొలిమెట్టుపై ఉంచబోయాడు. ఆశ్చర్యం! ఆ క్షణం….
మంగళ వాద్యాలు మిన్నంటి మ్రోగుతున్నాయి. భోజరాజు సంతోషంగా, సింహాసనాధిష్టిత కాంక్షతో, సుతారంగా కుడిపాదం ఎత్తి, తొలిమెట్టుపై ఉంచబోయాడు.
ఆశ్చర్యం!
ఆ క్షణం…. సింహాసనపు 32 మెట్ల మీదా ఉన్న సువర్ణ ప్రతిమలన్నీ, ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లు రెండు చేతులా చప్పట్లు చరుస్తూ, భోజరాజుని చూసి పక పకా నవ్వాయి.
సభలోని వారంతా విభ్రాంతితో స్థబ్ధులయ్యారు. ఒక్క క్షణం భోజరాజు లజ్జితుడైనాడు. మరుక్షణం తాను భ్రాంతి పడ్డానా అనుకున్నాడు. మరోసారి తొలిమెట్టుపై కాలు మోపబోయాడు. మళ్ళీ బొమ్మలన్నీ ఒక్కసారిగా ఘొల్లున నవ్వాయి. నేల మీద మువ్వలు జారినట్లు, ముత్యాలు దొర్లినట్లు, కోటి కోయిలలు కిలకిల లాడినట్లు సవ్వడి చుట్టు ముట్టింది.
కొద్దిక్షణాలకు భోజరాజు తేరుకున్నాడు. గొంతు సవరించుకొని “ఓ సువర్ణ ప్రతిమలారా! ఇదేమీ వింత? ఏల నన్ను జూచి నవ్వుతున్నారు? నేను సింహాసన మధిష్టించ మెట్టుపై కాలూన బోవగా, చప్పట్లు చరిచి మరీ నవ్వుతున్నారే! నేను మీకింతగా చులకన ఎట్లయ్యాను? ఎందుకిలా పరిహాసం చేస్తున్నారు?” అన్నాడు.
సింహాసనపు తొలిమెట్టుపై నున్న బొమ్మ, కలస్వనంతో…
“ఓ భోజరాజా! నీవు మాకెందుకు చులకన అవుతావు? నీపై మేము ఎందుకు పరిహాసమాడుతాము? ఎంతో ప్రయత్నము చేసి, మీరు, మీ పరివారమూ, మంత్రివర్యులూ, ఈ సింహాసనాన్ని మట్టిలో నుండి వెలికి తీసి, శుభ్రపరిచి, మెరుగులు దిద్ది, ఈ సభాభవనమున నిలిపినారు.
ఈ సింహాసనముపై కూర్చుని ప్రజాపాలన చేయగల అర్హత గల వారెవ్వరూ లేనందువల్లనే ఇది మట్టిలో కూరుకుపోయినది. ఈ సింహాసనంపై కూర్చొన వలెనను ఆశ నీకు ఉంటే, నీవు దీని చరిత్ర తెలుసుకోవాలి, మరింకెన్నో నేర్చుకోవాలి. అదేదీ తెలియక నీవీ గద్దె నెక్కనుద్యుక్తుడవైనావు.
‘ఇతడీ సింహాసనము నెక్కిన ఎక్కనిమ్ము. మనకేమి గావలె’ నని తలపోసి మేమూరక యుంటిమేని మాకు ‘ఉదాసీనత దోషం’ అంటుకోక మానదు. ఏదైనా దుష్కృతి జరుగుయెడల, ఆ పాపం పాపకర్తయైన మానవుని కొక్కనికే చెందదు, ఆ పాప కార్యమును చూచియూ, దాని గురించి తెలిసియూ, దానినాపక, కేవలము ప్రేక్షకత్వం వహించి చూచువారల కెల్ల యా పాపమంటును.
అందుకే…. ఇదేవీ తెలియక సింహాసనము నెక్కబోయిన నిన్ను ఆపుటకే, మేమిట్లు నిన్ను ఆటంకపరిచితిమి. ఈ సింహాసనముపై కూర్చొని ప్రజా పాలన చేయ అర్హత గలవారే దీనిపై కూర్చొన వలెను. అట్లుగాక ఎవరైనా అనర్హులయ్యీ, సింహాసనము నధిష్టింపబ్రయత్నించినచో వారి తల శతసహస్ర ముక్కలవ్వగలదు.
పూర్వం విక్రమాదిత్యుడనే మహారాజు ఈ సింహాసనముపై కూర్చొని, తన మంత్రియైన భట్టితో కలిసి, రెండువేల ఏళ్ళు రాజ్యమేలినాడు. భట్టి అపర బృహస్పతి. విక్రమాదిత్యుడు గొప్పజ్ఞాని, అంతకంటే గొప్ప సాహసికుడు, అరివీరయోధుడు. అతడు అరువది నాలుగు కళల నామూలాగ్రమూ తెలిసిన వాడు. ధైర్యసాహసాలు, పౌరుషము, పరాక్రమమూ, దానగుణమూ కలవాడు. దయా సముద్రుడు. సకల శాస్త్ర పారంగతుడు.
విక్రమాదిత్యునికి గల సుగుణాలలో, వెయ్యింట ఒక వంతైననూ నీవు కలిగి ఉంటే, ఈ సింహాసనము నెక్కుటకు సాహసింపుము. లేదా నీ కోరికని కట్టిపెట్టుకొమ్ము.
ఇది అంతా తెలిసి ఉండుట చేతనే, గద్దెనెక్కు నుత్సుకత చూపుతున్న నిన్ను చూసి నవ్వినాము. భోజరాజా! ఇకపై ఆలోచించి ఏమి చేయుదువో నిర్ణయించుకోగలవు. ఇంతకూ నా పేరు చెప్పనైతిని. ఈ తొలిమెట్టుపై నిలిచిన నా నామధేయము వినోద రంజిత” అన్నది.
అప్పటి వరకూ… శీతాకాలపు సాయంత్రం తుషార బిందువులు కురిసినట్లు, సంధ్య వేళ సన్నజాజులు మెల్లిగా నేలకు జారినట్లు నెమ్మదిగా, అదే సమయంలో జలపాతం దుమికినట్లు, సెలయేరు ప్రవహించినట్లు అనుశృతంగా, నిరంతరాయంగా ధ్వనించిన ఆమె కంఠం, నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది.
ఈ నేపధ్యంలో…. కథాపూర్వకంగా చెప్పబడే ఇలాంటి మంచి భావనలు, చిన్నారులలో బలంగా నాటుకుంటాయి. సింహాసనం మీది బొమ్మలు ‘పోతే పోనీ! సింహాసనాన్ని భోజరాజు ఎక్కితే ఎక్కనీ’ అనుకుంటే భట్టి విక్రమార్క కథలే ఉండేవి కాదుగదా!]
ఇది విని భోజరాజు ఆశ్చర్యచకితుడైనాడు. సభలోని వారెల్లరూ ఈ విడ్డూరాన్ని చూసి శిలాప్రతిమల్లా అప్రతిభులైనారు. కొన్ని క్షణాల తర్వాత భోజరాజు “ఓ ప్రతిమామణీ! వినోద రంజితా! నీవింత వరకూ విక్రమాదిత్య మహరాజు గురించి చెప్పితివి. ఎవరా మహరాజు? అతడి చరిత్ర ఏమిటి? ఆయన గుణగణాలెటు వంటివి? నేనది తెలియగోరుచున్నాను. నీకు సమ్మతమైతే, భట్టి విక్రమాదిత్యుల గురించిన మా కుతుహలాన్ని, ఆసక్తిని మన్నించి, ఆ వివరాలు మాకు చెప్పవలసిందిగా నా కోరిక!” అని మృదువుగా పలికాడు.
వినోద రంజిత ప్రతిమ అంగీకార సూచకంగా తలాడించింది. సభాసదనమంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఆశ్చర్యంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, మనసంతా చెవులుగా పరుచుకొని కథ వినేందుకు సంసిద్దలుయ్యారు. వినోద రంజిత భోజరాజు వైపు సాదరంగా చూస్తూ “భోజరాజా! ఇప్పుడు నేను విక్రమాదిత్య మహరాజుకు పూర్వగాధ చెప్పబోతున్నాను. సావధానుడవూ, భక్తి వినమ్రుడవూ అయి వినెదవు గాక….” అంటూ ఇలా చెప్పసాగింది.
ప్రాచీన కాలంలో, కర్మభూమియైన భారత ఖండంలో నంది పురమనే పట్టణ ముండేది. అందులోని బ్రాహ్మణ వాడలో, మిగుల సౌందర్యవంతుడైన యువకుడు ఒకడుండేవాడు. అతడి పేరు చంద్రవర్ణుడు. [చంద్రవర్ణుడు అంటే – చంద్రుని కాంతి వంటి శరీర ఛాయ గలవాడు అని అర్ధం.] చంద్రవర్ణుడు మంచివాడు. నీతి నియమాలు, ధర్మచింతనా గలవాడు. పైగా పండితుడు. అతడెన్నో శాస్త్రాలనూ, కళలనూ అభ్యసించాడు. అయినా గానీ, తాను నేర్చిన విద్యల పట్ల అతడికి సంతృప్తి లేదు.
“ఈ జగత్తున ఇంకనూ నేర్వవలసిన కళలూ, శాస్త్రాలూ, విద్యలూ ఎన్నిగలవో ఎవరూ చెప్పలేరు. నేనింకా నేర్వవలసింది ఎంతో ఉంది. ఇలాగే ఉంటే నా తృష్ణ తీరదు. సద్గురువును ఆశ్రయించి, విద్యల నభ్యసించవలసిందే” అని నిశ్చయించుకున్నాడు.
స్థిర నిశ్చయానికి వచ్చిన చంద్రవర్ణుడు ఇల్లు విడిచి పెట్టాడు. సద్గురువుని అన్వేషిస్తూ బయలు దేరాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. పుణ్యక్షేత్రాలు చుట్టబెట్టాడు. విద్వాంసులున్నారని పేరున్న చోటునల్లా సందర్శించాడు. తన జ్ఞానతృష్ణని తీర్చే గురువుని కనుక్కోలేక పోయాడు. అయితే చంద్రవర్ణుడు తన సంకల్పాన్ని మాత్రం విడిచి పెట్టలేదు.
సద్గురు అన్వేషణనీ మానలేదు. ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా సాగుతూ… ఒక నిర్జనారణ్యాన్ని చేరాడు. అతడప్పటికే బాగా అలిసిపోయి ఉన్నాడు. అతడికి ఎదురుగా చిన్న కొండ ఉంది. ఆ ప్రక్కనే ప్రశాంతంగా ఓ నది ప్రవహిస్తోంది. నది ఒడ్డున ‘ఆకాసాన్నంతటినీ ఆవరించి ఉందా?’ అన్నట్లు రావి చెట్టొకటి ఉంది. నది నీటి గలగలలతో, రావి ఆకుల గలగలలు పోటీ పడుతున్నాయి.
చంద్రవర్ణుడు నదిలోకి దిగి దాహం తీర్చుకున్నాడు. ఆ చల్లని నీటిలో స్నానమాచరించాడు. అలసిన శరీరం, మనస్సు కూడా సేదతీరాయి. రావి చెట్టు క్రింద చేరగిలబడ్డాడు. చల్లని గాలి మెల్లిగా వీస్తోంది. చంద్రవర్ణుడు విశ్రాంతిగా ఆ చెట్టు నీడలో నిద్రించాడు.
భారీగా ఉన్న ఆ రావి చెట్టు మీద, చాలా కాలం నుండీ ఓ బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. [రాక్షసులు తామస గుణాత్ములు. వారిలో సత్వగుణం గల రాక్షసులని బ్రహ్మరాక్షసులంటారు. రాక్షసులలో వీరు మహర్షుల వంటి సాధు పురుషులన్న మాట.] అతడా రావి చెట్టు కొమ్మలపై ఉంటూ, ప్రతీరోజూ తపమాచరిస్తూ ఉన్నాడు. సంధ్యా వందనం చేసుకోవటానికి బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చాడు. నది వైపు అడుగులు వేయబోయి, చెట్టు నీడన నిద్రిస్తున్న చంద్రవర్ణుణ్ణి చూశాడు.
ఆ బ్రాహ్మణ యువకుడి ముఖ వర్ఛస్సు, దేహకాంతిని బట్టి అతడి జ్ఞానతృష్ణని గ్రహించాడు. సుందరుడూ, సుకుమారుడూ అయిన చంద్రవర్ణుడి పట్ల బ్రహ్మరాక్షసుడికి ఎంతో వాత్సల్యం కలిగింది. నదిలో స్నానాదికాలు ముగించుకొని, సూర్య భగవానుడికి సంధ్యావందనాది అనుష్టానాలు ఆచరించి, చంద్రవర్ణుడి దగ్గరికి వచ్చాడు. అతణ్ణి తట్టి లేపాడు.
నిద్రలేచిన చంద్రవర్ణుడు, ఎదురుగా ఉన్న బ్రాహ్మ రాక్షసుడిని చూసి, నమస్కరించి నిలబడ్డాడు. బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడి వైపు ప్రేమగా చూస్తూ “వత్సా! ఎవరు నీవు? ఈ నిర్జనారణ్యానికి ఎందుకు వచ్చావు? మానవ మాత్రులెవరూ ఈ దుర్గమారణ్యంలోకి అడుగు పెట్టేందుకు సాహసించరే? నీవెందుకు వచ్చావు?” అని అడిగాడు.
చంద్రవర్ణుడు వినమ్రత ఉట్టిపడే స్వరంతో “మహాత్మా! నా పేరు చంద్రవర్ణుడు. ‘నందిపురం’ అనే పట్టణ వాసిని. నన్ను ఉద్దరించగల సద్గురువును అన్వేషిస్తూ తిరుగుతున్న వాడిని! నా దురదృష్టం కొద్దీ, నా ప్రయత్నాలు సఫలం కాలేదు. చూడగా మీరెవ్వరో, పండితుల వలె కనబడుతున్నారు. మీ ముఖ కాంతి, జ్ఞానదీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దయ ఉంచి, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి” అన్నాడు.
బ్రహ్మరాక్షసుడికి, చంద్రవర్ణుడిపై కలిగిన వాత్సల్యం, అతడి మాటలు వినేసరికి రెట్టింపయ్యింది. ఎంతో దయగా “నాయనా! తప్పకుండా నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తాను. భగవంతుడే నిన్ను నా దగ్గరికి పంపినట్లున్నాడు. నాకు తెలిసిన విద్యలన్నిటినీ నీకు ఆరునెలల్లో నేర్పుతాను. అయితే ఒక నియమం ఉన్నది” అని ఆగాడు.
చెప్పమన్నట్లుగా చేతులు జోడించాడు చంద్రవర్ణుడు. బ్రహ్మరాక్షసుడు కొనసాగిస్తూ “ఆరునెలలు పాటు నువ్వు ఆకలిదప్పలు, అలసటా మరిచిపోవాలి. అన్నపానాదులు, నిద్రా విశ్రాంతులు మాని, అనుశృతంగా నేర్చినట్లయితేనే నీకు నేను విద్యలు నేర్పగలను” అన్నాడు.
చంద్రవర్ణుడు ఆందోళన నిండిన కళ్ళతో, గురువు పాదాల మీద వ్రాలాడు. “స్వామీ! అందుకు తగిన తరుణోపాయం మీరే చెప్పండి” అని ప్రార్దించాడు. బ్రహ్మరాక్షసుడు అతడి పట్ల మరింత సంప్రీతుడై “నాయనా! దిగులు చెందకు. నేను నీకో మంత్రోపదేశిస్తాను. ఆ ప్రభావంతో నీకు ఆరునెలలుపాటు తరగని శక్తి లభిస్తుంది. దాని సహాయంతో నీవు అలసట, నిద్ర, ఆకలి, దప్పికలని నియంత్రించుకోగలవు. నేనీ రావిచెట్టు కొమ్మలపై కూర్చుండి, రావి ఆకులపై శ్లోకములను వ్రాసి క్రింద పడవేస్తాను. నీవా ఆకులని గ్రహించి, వాటిపై శ్లోకములను పఠించవచ్చు” అన్నాడు.
చంద్రవర్ణుడి సంతోషం అవధులు దాటింది. బ్రహ్మరాక్షసుడికి గురుభావంతో, వినయంగా, తలవంచి నమస్కరించాడు. విద్యాభ్యాసం ప్రారంభమైంది. నిద్రాహారాలు లేకుండా బ్రహ్మరాక్షసుడు విద్యల నేర్పుతున్నాడు, చంద్రవర్ణుడు నేర్చుకుంటున్నాడు. ఆరునెలల కాలం గడిచింది.
అప్పుడు సంభవించిందొక అద్భుతం!