మంచంపై పడుకొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ నెమరేసుకుంటున్నాడు కిరీటి. కళ్ళు మూసుకుంటే సునయన కళ్ళముందు కనిపిస్తోంది. ఇంతలోనే నిక్కీ ఆలోచనల్లో చొరబడుతోంది. సునయన ముఖం, నిక్కీ ఒళ్ళు కలగలిసిపోయి చిత్ర విచిత్రమైన కలలన్నీ వచ్చి అది ఇది అని చెప్పలేని ఒక బాధ మనసును మాయ చేస్తోంది. ముందే చెప్పుకున్నాంగా, ఈ కథ అనుకోకుండా ఈ కుర్రాళ్ళ జీవితంలో ప్రవేశించిన వారి వల్ల జరిగిన మార్పుల గురించి అని… ఈ రోజు కిట్టి, కిరీటి జీవితాల్లో చెరగని ముద్ర వేసింది. మర్నాడు, ఆ తరువాతి రోజు కలిసి సంతకి పోవటం కుదర్లేదు స్నేహితులకి. కిట్టి మాత్రం ప్రతిరోజూ వెళ్ళి తన ఫేవరెట్ నటుడి ఏకపాత్రాభినయం చూసి వస్తున్నాడు. ఇంకా సంత ఒక్క రోజే వుంది. ఆ రోజు రాత్రికి ఎలాగైనా వెళ్ళి తీరాలని అనుకున్నారు నలుగురూ. చివరకు జరిగింది వేరు.
సంతకి పోవడానికి అందరూ ఒక చోట చేరాక ‘రే మామా, సచ్చిందిరా గొర్రె. Chemistry records ఇస్తానికి రేపేరా ఆకరి రోజు’ అంటూ గోరు గుర్తుచేశాడు. ‘మీరింకా రాయలేదారా?’ అన్న కిరీటిని తినేసాలా చూశారు ముగ్గురూ. ‘రాసేవోడివి ఓ మాట సెప్పాల గందా’ అంటూ ఫైర్ అయ్యాడు గోరు. చిన్నగా నవ్వి ‘నా రికార్డ్ ఇస్తానురా. చూసి జాగ్రత్తగా రాయండి. వున్నది వున్నట్టు దించేశారో ఒక్కొక్కడిని మక్కెలిరగ్గొడతా. కాపీ కొట్టామని అందర్నీ fail చేస్తారు.’ అని వార్నింగ్ ఇచ్చాడు.
‘నువ్వు దేవుడు సామీ’ అంటూ రంగా, గోరు కిరీటిని వాటేసుకున్నారు. కిట్టి మటుకు కొంచెం unhappyగా వున్నాడు. ‘నీకేటైనాదిరా, రికార్డ్ రాయాలని మాకూ లేదు. టైమ్ కి ఇయ్యకపోతే సాయిబు (chemistry లెక్చరర్) fail చేస్తాడని చెప్పినారు గంద సీనియర్లు’ అన్న గోరుతో ‘ఔ … నాకూ గుర్తుందిరా. నైటుకి రాములు బాబాయి, అదే, దుర్యోధన పాత్ర ఆయన ఒకసారి కల్వమని చెప్పుండే. రేపుట్నుంచి మళ్ళా కనబడ్డు గందా’ అన్న కిట్టిని ఒక ఊపు ఊపి ‘ఒరేయ్, ముందు దీని సంగతి సూడ్రా సామీ. సంకురేత్తిరికి మళ్ళా సంతెడతారు. రాములు కాదు ఈ సారి ఆయబ్బ అమ్మ మొగుడొస్తాడు’ అని గోరు అందర్నీ కిరీటి ఇంటి వైపు బయల్దేరదీశాడు.
రికార్డ్ మిత్రుల చేతిలో పెట్టి కిరీటి ఒక్కడే ఖాళీగా మిగిలాడు. కొంతసేపు ఊగిసలాడాడు కానీ చివరకు తన సైకిలుపై ఒక్కడే వెళ్ళాడు సంతకి. సంత మొత్తం తిరిగాడు కానీ ఎక్కడా సునయన కానీ ఆమె షాపుకానీ కనిపించలేదు. ఉసూరని ఇంక ఇంటికి పోదామని సైకిల్ స్టాండు వైపుకి బయల్దేరాడు.
‘ఏం హీరో, మమ్మల్ని చూడ్డానికి మళ్ళీ టైమ్ కుదర్లేదా అబ్బాయిగారికి’ అంటూ ఎవరో భుజంపై చెయ్యి వేశారు. వెనక్కు తిరగకముందే కిరీటి మైండ్ లో ఒక రకమైన విస్ఫోటనం సంభవించింది. ఆ గొంతు ఒకేఒక్కసారి విన్నాడు కానీ ఇక జీవితంలో మర్చిపోలేడు. వెనక్కు తిరిగి చూస్తే సునయన, ఆమెతోపాటు ఆజానుబాహుడైన ఒక వ్యక్తి వున్నారు.
‘hi సునయన గారూ, అదేం లేదండీ. ఏదో కాలేజీ క్లాసుల్లో కొంచెం బిజీ. ఇవ్వాళ మిమ్మల్ని… అదే మీ షాపు చూద్దామని వచ్చాను. కానీ మీరెక్కడా కనబడలేదు’ అంటూ తడబడుతూ చెప్పాడు. బుగ్గ సొట్ట పడేలా నవ్వి తన పక్కనున్న వ్యక్తి చేతిలోని పెద్ద పెట్టెని చూపించి ‘మేము అందరికంటే ముందే దుకాణం సర్దేశాము. ఇకనో ఇంకాసేపట్లోనో బస్సు వస్తే వెళ్లిపోతాము’ అని చెప్పింది.
చేతికున్న వాచ్ చూసి కిరీటి ‘సాయంత్రం బస్సు వెళ్లిపోయిందండి. మళ్ళీ పట్నం వెళ్ళే బస్సు పదిగంటలకే’ అని చెప్పాడు. సునయన తన పక్కనున్న వ్యక్తి వైపుకి తిరిగి ‘అబ్బా, ఇంకా రెండు గంటలు wait చెయ్యాలా. నాకు ఆల్రెడీ మెంటల్ ఎక్కుతోంది’ అని ‘by the way, ఈయన పేరు ధనుంజయ్, ఇతని పేరు కిరీటి’ అంటూ ఒకరికి ఒకరిని పరిచయం చేసింది. ధనుంజయ్ కిరీటికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘నువ్వు కొంచెం మా సునయనకి కంపెనీ ఇవ్వగలవా కిరీటీ, నేను నైటు పట్నం చేరేదాకా ఆకలికి ఆగలేను. అలా వెళ్ళి ఏమన్నా తినేసి వస్తాను’ అని అడిగాడు. కిరీటికి కూడా సునయనతో ఒంటరిగా వుండాలి అని వుంది కానీ బయటపడలేక పోతున్నాడు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని question చేసే పరిస్థితిలో లేడు. ‘సరేనండి. మేము అలా బ్రిడ్జి పక్కన కాల్వ గట్టున వుంటాము. పెట్టె మా దగ్గర పెట్టి వెళ్తారా’ అని అడిగాడు.
పెట్టె చేతికి అందించబోతుంటే సునయన ఆపి ‘ఓయ్, ఒకసారి పక్కకి తిరిగితేనే card తీసుకొని వెళ్లిపోయాడు. ఇప్పుడు పెట్టె మొత్తం అయ్యగారి చేతిలో పెడతావా? నో, నువ్వే తీసుకెళ్లు’ అన్నది. తనకదేమీ పెద్ద భారం కాదన్నట్టు ధనుంజయ్ అవలీలగా పెట్టె మోసుకొని ఫుడ్ వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఇవతల కిరీటి సిగ్గుతో కార్డ్ విషయం తెలిసిపోయినందుకు ఏం మాట్లాడాలో తెలీక తలవంచుకొని నిలబడిపోయాడు. సునయన అతడి ఇబ్బందిని చూసి గట్టిగా నవ్వి ‘నువ్వు కార్డ్ తీసుకెళ్లినందుకు నాకేమీ కోపం లేదయ్యా మగడా. ధనుంజయ్ అంటే బండరాముడు. కనపడదు కానీ పెట్టె చాలా బరువు. మనకెందుకు మోత బరువు అని అతగాడ్నే తీసుకుపొమ్మన్నా’ అన్నది.
ఇంకా మాట్లాడకపోయేసరికి ‘నమ్మవా, నా మీద ఒట్టు. Taking that card was a marvelous trick you pulled on me’ అన్నది. కిరీటి సిగ్గుని అతడి క్యూరియాసిటీ జయించింది. ‘మీరు ఇంత బాగా ఇంగ్లిష్ ఎలా మాట్లాడగలరు? ఎంత వరకు చదువుకున్నారు మీరు?’ అని అడిగాడు. సునయన చేతులు కట్టుకొని తన తేనె కళ్ళతో కిరీటిని పరీక్షగా చూస్తుంటే స్వతహాగా కొంచెం introvert ఐన కిరీటికి ఇబ్బందిగా వుంది. నిలబడ్డ చోటే కాళ్ళు కదిలిస్తూ మళ్ళీ అడగరానిది ఏమన్నా అడిగానా అనుకుంటూ వుండిపోయాడు.
‘hmm, నా రూల్ తెలుసు కదా, నన్ను ఏమన్నా అడిగే ముందు ఏదైతే అడిగావో నీ గురించి ఆ విషయం నాకు చెప్పాలి’
‘నేను డిగ్రీ 1st ఇయర్ స్టూడెంట్. Inter వరకు తెలుగు మీడియం. ఇంగ్లిష్ లో ఇంకా కొంచెం struggle అవుతున్నాను. మీరు ఇంత easy గా ఇంగ్లిష్ మాట్లాడుతుంటే నాకు ఎప్పటికైనా అలా మాట్లాడాలని కోరిక కలుగుతోంది’
సునయన మెత్తగా నవ్వి ‘నేను formal గా టెన్త్ వరకే చదివాను. తరువాత డబ్బులు లేక చదువు ఆగిపోయింది’ అన్నది. కిరీటి నమ్మలేనట్లు చూస్తే తలమీద చెయ్యి వేసుకొని ‘ప్రామిస్’ అన్నది. ‘మీరు చాలా గ్రేట్ అండీ. మీరు మాట్లాడినంత బాగా మా లెక్చరర్ కూడా మాట్లాడడు’ అని చెప్పాడు. ‘మునగ చెట్టు ఎక్కించకు అయ్యా’ అంటే ఈ సారి కిరీటి తన నెత్తిపై చెయ్యి వేసుకొని ‘ప్రామిస్’ అన్నాడు.
గలగలా నవ్వి సునయన ‘పైకి అస్సలు కనిపించవు కానీ నువ్వు పెద్ద కరోడా’ అంటూ తన కుడి చేత్తో అతడి ఎడమ చేతిని పెనవేసింది. ‘రెండు గంటలు నేను నీ దాన్ని. కాసేపు మీ సంత చూపించు. తర్వాత పోయి అక్కడ కూర్చుందాం’ అంటూ కిరీటిని లాక్కుపోయింది. ఇవతల మనవాడు సునయన చెయ్యి తగలగానే మైండ్ బ్లాంక్ అయ్యి తన వెంట వెళ్తున్నాడు.
కిరీటి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఏకైక సంతానం. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు. ఆడవాళ్ళతో కలవటం తక్కువ. ఇదిగో ఇప్పుడే డిగ్రీలో మొదటిసారి కో-ఎడ్ కాలేజీలో అమ్మాయిలతో కొంచెం మాట్లాడడం. తండ్రి నేర్పిన సంస్కారం, స్వతహాగా వున్న సిగ్గరితనము అమ్మాయిలని ఎప్పుడూ వక్రబుద్ధితో చూడనివ్వలేదు. ఇలాంటి ఒక కుర్రవాడికి సునయన, నిక్కీ వంటి వారు తమంతట తామే మీద పడితే ఎలా వుంటుందో ఆలోచించండి! ఇలా మొదలైన ఆడవారి సాన్నిహిత్యం అతడి characterలో ఏమన్నా మార్పులు తెచ్చిందా, అది యే రకంగా రూపాంతరం చెందింది అనేది కథాగమనంలో చూద్దాం. మెత్తటి సునయన వొళ్ళు హత్తుకుపోతుంటే కిరీటికి ఆమె మాటలపై గురి పెట్టడం చాలా కష్టంగా వుంది. కొంత తేరుకొని తను కూడా ఆమె కంపెనీని ఆస్వాదించడం మొదలెట్టాడు. సరదాగా సంత అంతా కలియతిరుగుతున్నారు. ‘మీకు ఆకలి వెయ్యటం లేదా? ఏమన్నా తింటారా?’ అని అడిగితే ‘చూశావా, నువ్వు కాబట్టి అడిగావు. ఆ రాతిమనిషి తన పొట్ట సంగతి చూసుకుందుకు పోయాడు కానీ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఆకలి వేస్తోంది కానీ మా డబ్బులన్నీ ధనుంజయ్ దగ్గర వున్నాయి. ఇప్పుడు అతగాడిని వెదికే ఓపిక నాకు లేదు.’ అన్నది.
మారు మాట్లాడనివ్వకుండా ఆమెని తినుబండరాలు దొరికేచోటికి తీసుకువెళ్లి సునయన ఏది అడిగితే అది ఇప్పించాడు. ‘Many thanks కిరీటీ, ఇప్పుడు నేను నీకోక భోజనం బాకీ. పద ఎక్కడైనా కాసేపు విశ్రాంతిగా కూర్చుందాం’ అని చెప్పి నాటకం జరిగే స్టేజ్ వైపు వెళ్లారు. స్టేజి ఎదురుగా వున్న కుర్చీల్లో కూలబడి కాసేపు గోదారి పైనుంచి వచ్చే చల్లగాలి ఆస్వాదిస్తూ వున్నారు ఇద్దరూ.
ఎదురుగా స్టేజిపై ఏవో నాటకాలు సాగుతున్నాయి కానీ కిరీటి వాటినేవీ పట్టించుకునే స్థితిలో లేడు. భుక్తాయాసమో, అలసట వల్లనో కానీ సునయన కుర్చీలో జారగిలబడి కన్నులు మూసుకుంది. రెప్ప వాల్చకుండా కిరీటి ఆమెనే చూస్తున్నాడు. మళ్ళీ జీవితంలో ఇలాంటి అమ్మాయిని చూస్తానని కానీ ఇంత దగ్గరగా, చనువుగా వుంటానని కానీ అతడికి నమ్మకం లేదు.
‘అలా పీక్కుతినేలా చూడకోయి, సిగ్గేస్తోంది’ అని సునయన అంటే గతుక్కుమని ‘నేను మిమ్మల్నే చూస్తున్నానని ఏమిటి గ్యారంటీ. ఐనా మీరు కళ్ళు మూసుకుని వుంటే మీకెలా తెలుసు నేనేమి చూస్తున్నానో. ఇది ఇంకొక మ్యాజిక్ ట్రిక్కా?’ అన్నాడు. ‘నీలాగా వయసులో వున్న కుర్రాళ్ళు చూసేదేమిటో చెప్పడానికి మా అమ్మాయిలకి మ్యాజిక్ అక్కర్లేదు’ అని నవ్వుతూ అంటోంది. సీరియస్ గా ఏమీ లేకపోయేసరికి కిరీటి ఆమె పైనుంచి చూపు తిప్పుకోలేక పోతున్నాడు.
స్టేజ్ మీద దుర్యోధనుడు పాంచాలి మీద పగ సాధిస్తాను అని భీకరంగా ప్రతిజ్ణ చేసి జనాల చప్పట్ల మధ్య తన పాత్ర ముగించాడు. ఒకసారి స్టేజ్ వంక చూస్తే దుర్యోధనుడి పాత్రధారితో మాట్లాడే వ్యక్తి ముఖం బాగా పరిచయం వున్నట్టు తోచింది కిరీటికి. మైండ్లో బల్బు వెలిగి ‘కిట్టీ’ అంటూ సడన్ గా లేచి నుంచున్నాడు. రికార్డ్ రాయాల్సినవాడు ఇక్కడకి ఎందుకు వచ్చాడో అర్ధం కాలేదు. క్లాస్ fail అవుతామన్న జ్ణానం కూడా లేకుండా ఇలా చేసేసరికి వాడి మీద కోపం వచ్చింది.
‘ఏమయ్యింది, ఎవరికైనా దెబ్బలు తగిలయా అంత react అయ్యావు’ అని సునయన అడిగితే ‘ఇప్పుడు కాదు లెండి, రేపు తగులుతాయి వాడికి దెబ్బలు’ అంటూ మళ్ళీ కూర్చున్నాడు కానీ ఇంక restless గా అయిపోయాడు. ఓ పక్క ఇప్పుడే వెళ్ళి కిట్టిగాడిని చెడామడా తిట్టాలని వుంది. కానీ సునయన పక్కనుండి కదలాలని లేదు! కిట్టి సంగతి రేపు చూడొచ్చు అని ఫిక్స్ అయి మళ్ళీ సునయన వంక చూస్తూ కూర్చున్నాడు.
‘ఇలాగే వుంటే నువ్వు నన్ను చూపుల్తోనే తినేస్తావు. పద, ఎక్కడికైనా పోయి కాసేపు కబుర్లు చెప్పుకుందాం’ అని కిరీటిని అక్కడ్నుంచి లాక్కుపోయింది. కొంచెం జనసందడి లేకుండా ఖాళీగా వున్న చోటకు వెళ్ళి నెల మీద కూలబడ్డారు ఇద్దరూ. ‘హమ్మయ్య’ అనుకుంటూ విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ఎడమ చెయ్యి మడిచి తల కింద పెట్టుకొని కిరీటినే చూస్తూ, ‘నిన్నూ, మీ ఊరినీ మర్చిపోకుండా వుండేలా ఏమన్నా విశేషమో, కథో చెప్పవోయ్’ అని అడిగితే ఏం చెప్పాలబ్బా అని ఆలోచించి ఒక పుల్ల తీసుకొని నేల మీద ఏదో గీయటం మొదలెట్టాడు.
ఏం గీస్తున్నాడా అని కొంచెం వాలుగా వంగి చూస్తోంది సునయన. ఆమెను ఆ యాంగిల్లో కన్నార్పకుండా చూడాలని వుంది కానీ చూస్తే దొరికిపోతామని డిసైడ్ అయ్యి తను గీసినదాన్ని చూపించి చెప్పడం మొదలెట్టాడు.
‘మా వూరి పేరు ఒకప్పుడు సూరారం అట. సూర్యవరం అనే పేరుకి shortcut అనుకోండి. ఆ పేరు ఎందుకు పేరొచ్చిందంటే..’ అంటూ తను గీసిన బొమ్మ చూపించాడు. అది crudeగా గీసిన సూర్యుడి బొమ్మలా వుంది. అంటే, ఒక circle, దానినుంచి కిరణాల వలే ఏడు గీతలు గీసినట్టు వుంది. సునయన కళ్ళలో కుతూహలం చూసి కిరీటి చెప్పడం కంటిన్యూ చేశాడు. ‘ఇదిగో circleలా వుందే, ఇది మా ఊరు. ఇప్పుడు పంచాయితీలు, నియోజకవర్గాల బోర్డర్లు మార్చాక మరీ ఇంత రౌండ్ గా లేదు కానీ ఒకప్పుడు ఇలానే వుండేదిట.’
‘ఇదుగో ఈ ఏడు గీతలున్నాయే, ఇవి మా ఊళ్ళోకి వచ్చే దారులు. చూసారూ, ఇవి ఏడు దిక్కులనుంచి మా ఊరికి వచ్చే దారులు. అలాగే ఎనిమిదో దిక్కు నుంచి కూడా ఒకప్పుడు దారి వుండేదట’ అంటూ ‘ఇది ఉత్తరం దిక్కు’ అని చూపుతూ మిగతా గీతలకంటే కొంచెం సన్నగా ఒక గీత గీశాడు. ‘ఇప్పుడు ఉత్తరాన శ్మశానం తప్పితే ఇంకేమీ లేదు. అట్నుంచి ఎవరూ ఊళ్ళోకి అడుగుపెట్టరు కూడా.’
‘అన్ని ఊళ్లలాగానే ఇదీనూ. కాకపోతే మీ ఊళ్ళోకి రోడ్లు ఎక్కువ. ఇందులో విశేషం ఏముంది’ అంటూ తన ముఖంపైన పడుతున్న జుట్టు చెవి వెనక్కు తోసుకుంటూ అడిగింది సునయన.
‘మీకు impatience ఎక్కువ అండీ’
‘నోరు మూసుకుని చెప్పేది వినమని ఇంత గౌరవంగా ఎవ్వరూ చెప్పలేదయ్యా నాకు ఇన్నాళ్ళలో’
‘అహహ… అది కాదండీ నా వుద్దేశం’ అని కంగారు పడుతున్న కిరీటిని చూసి నవ్వి ‘ఆట పట్టించటానికి అన్నానోయి’ అని అతని చెయ్యి నొక్కి ‘ఇంక disturb చెయ్యనులే, చెప్పు’ అంది సునయన.
‘ఇంతకీ మా ఊరి పేరు ఎందుకు మారిందో చెప్పాలి. ఒకప్పుడు ఇక్కడ పెద్ద గుడి వుండేదిట. అలాంటి ఇలాంటి గుడి కాదండీ. చాలా పెద్ద సూర్యుడి గుడి. అంతే కాదండీ, సకల దేవతలకూ ప్రత్యక్ష స్వరూపం సూర్యుడు కాబట్టి ఆయన విగ్రహంతో పాటుగా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు వుండేవి అట ఆ గుళ్ళో. అవన్నీ వెలకట్టలేని పంచలోహ విగ్రహాలు అట. దాదాపు 50 విగ్రహాలు వుండేవిట. కాలక్రమంలో గుడి శిధిలమైపోయి విగ్రహాలు అన్నీ కనుమరుగైపోయాయి.’
‘ఇలా వుంటే, ఒక రోజు పెంచలయ్య అనే పశులకాపరికి చిన్న సూర్యుడి విగ్రహం దొరికిందట. విగ్రహం దొరికిన రోజు ఆ టైమ్ లో సూర్యగ్రహణం. కానీ విగ్రహం చేతిలోకి తీసుకోగానే గ్రహణం చీకట్లో ఏదో దారి కనిపించిందట పెంచలయ్యకు. ఆ దారెమ్మట వెళ్తే, పాత గుడి అందులో విగ్రహాలు అన్నీ కనిపించాయట. గ్రహణం పూర్తి అవ్వగానే విగ్రహాలు అన్నీ తుడిచి శుభ్రం చేసి దణ్ణం పెట్టుకొని వచ్చాడుట పెంచలయ్య. అప్పట్నుంచీ ఆ పెంచలయ్య వంశస్థులు ప్రతి సంవత్సరం సూర్యగ్రహణం రోజు ఆ చిన్న విగ్రహం పట్టుకు పోయి ఆ గుళ్ళో పూజ చేసి వచ్చేవాళ్లుట. అదుగో ఆ పెంచలయ్య పేరు మీద మా ఊరు పెంచలాపురం అయ్యింది’.
‘Wow! అద్భుతం. నాకిలాంటి కథలంటే ఎంత ఇష్టమో తెలుసా! మరిప్పుడు ఆ విగ్రహం ఎక్కడుంది? ఇప్పటికీ ఆ పెంచలయ్య వంశం వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తున్నారా?’ అంటూ కుతూహలంగా అడిగింది సునయన.
కిరీటి చిన్నగా నవ్వి ‘లేదండీ, పెంచలయ్య వంశం వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. ఇది ఒట్టి కథ. ఇందులో నిజం ఎంతో ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్ళో ఒక చిన్న సూర్యుడి విగ్రహం మటుకు వుందండి. ప్రతి సంవత్సరం రెండు సార్లు – సంక్రాంతి రోజు, రథసప్తమి రోజు ఊరేగిస్తారు. అది పంచలోహ విగ్రహం అనీ, గుళ్ళో వుంటే దొంగలు ఎత్తుకుపోతారని ప్రెసిడెంటు గారి ఇంట్లో భద్రంగా పెట్టి వుంచుతారు.’
‘మరి సూర్యగ్రహణం రోజు ఎప్పుడూ తీసుకెళ్లి పాత గుడి కోసం వెదకలేదా?’ చిన్నపిల్లలా కళ్ళు పెద్దవి చేసి అడిగింది సునయన.
‘అయ్యో రామ, చాలా సార్లు గవర్నమెంట్ ఆఫీసర్లు, పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి try చేశారు. గుడి కోసమని ఊళ్ళో చాలా చోట్ల తవ్వకాలు కూడా జరిపారు. ఏమీ దొరకలేదు. మా ఊరి గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎవరో ఎప్పుడో అల్లిన కథ అని చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తారు’ అంటూ చెప్పడం పూర్తి చేశాడు కిరీటి.
కాసేపు మౌనంగా వుండి కథ గురించి తలుచుకుంటున్నారు ఇద్దరూ. ‘చాలా బాగుంది కిరీటి. నేనైతే నమ్మేస్తాను ఇలాంటివి ఈజీగా. జీవితంలో కొంచెం మ్యాజిక్ లేకపోతే మజా ఏముంటుంది చెప్పు’ అంటూ వీపుపై పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తోంది సునయన. కాసేపాగి ‘మీ ఊరి గురించి మర్చిపోలేని విషయం చెప్పావు. నీ గురించి కూడా ఏమన్నా చెప్పవా. ఇంతే interestingగా వుండాలి’ అని అడిగింది.
‘నా లైఫ్ లో అంత interesting విషయాలు ఏమీ లేవండి. ఏదో నేనూ, మా ఫ్రెండ్స్ సర్కిల్. అందరు కుర్రాళ్లలానే నేనూ, అవే సరదాలు.’
‘కొయి కొయి కోతలు. నువ్వు పెద్ద ముదురు. బయటపడవు అంతే’ అంటూ అతనివైపు తిరిగి చిలిపిగా నవ్వింది.
ఎంత introvert కైనా ఎవరితోనైనా కుదిరితే సరదాగా మాట్లాడాలి అనిపిస్తుంది. కిరీటికి కూడా సునయనతో అలాంటి కనెక్షన్ ఏదో కుదిరింది. ఎవ్వరితోనూ చెప్పకూడదు, చెప్పలేను అనుకున్న విషయాలు ఫ్రీగా ఈ అమ్మాయితో చెప్పుకోవచ్చు అనిపిస్తోంది అతనికి. కొంచెం ఆలోచించి ‘మీ దగ్గర కార్డ్ తీసుకున్న రోజు చాలా లక్కీ అండి. కార్డ్ తీసుకున్న పది నిమిషాలకి నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ నేనొక అమ్మాయిని kiss చేశాను’.
సునయన గబుక్కున లేచి కూర్చుంది. ‘ha! నాకు తెలుసు నువ్వు పెద్ద జాదూ అని. చెప్పు చెప్పు, ఏ ఒక్క డీటైల్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం చెప్పు’ అంటూ కిరీటి భుజాల్ని పట్టుకుని ఊపేసింది. మొత్తం డీటైల్స్ కాదు కానీ ఎవరో అమ్మాయి తనని అంగట్ల మధ్యలోకి లాగి ముద్దు పెట్టుకోవడం, చివరకు కిరీటి తను అనుకుంటున్న వ్యక్తి కాదని తెలిసి పారిపోవటం గురించి టూకీగా చెప్పాడు.
‘నువ్వు ఇంకా సత్యకాలంలో వున్నవోయి. అడగకుండా అమ్మాయి ముద్దు పెడితే నేను నీ ప్రియుడ్ని కాదు అని ఎలా చెప్పబుద్ధి అయ్యింది నీకు. వచ్చిన బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా!’
కిరీటి కొంచెంసేపు ఏమీ మాట్లాడకుండా కాళ్ళు దగ్గరికి తీసుకొని గడ్డం మోకాళ్ళపై పెట్టి మౌనంగా వుండిపోయాడు. సునయన కూడా అతడ్ని ఆనుకొని గోదాటి మీదనుంచి వస్తున్న చల్లగాలి ఆస్వాదిస్తూ వుండిపోయింది. కాస్సేపటి తర్వాత కిరీటి నోరు పెగల్చుకొని ఇలా చెప్పాడు. ‘ఆ అమ్మాయి ముద్దు నేను అడక్కుండానే నాకు దక్కింది. అదొక్కటీ చాలు అనిపించింది. ఇంకా ఎక్కువ ఆ అమ్మాయి దగ్గర్నుంచీ తీసుకునేవాడినేమో కూడా. ఇంతలో మీ దగ్గర కొన్న పుస్తకం అడ్డు పడింది. మీరు గుర్తొచ్చి ఆగిపోయాను.’ ఈ చివరి మాటలు కొంచెం నవ్వుతూ చెప్పాడు.
సునయన అతడ్ని ఇంకా గట్టిగా హత్తుకుపోయింది ఈ మాట విని. కిరీటి తల తిప్పి చూస్తే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వున్నాయి. ‘సునయనా..’ అని ఏదో అడగబోతుంటే అతడి నోటిపై వేలు వేసి ‘నువ్వు పూర్తిగా పప్పుసుద్దవి కాదు. అలా అని పూర్తిగా జల్సారాయుడివి కూడా కాదు. రెండూ కరెక్ట్ పాళ్లలో కలగలిసిన మంచి అబ్బాయివి.’
‘ఇది నీలోని చిలిపితనానికి’ అంటూ రెండు బుగ్గలపైనా ముద్దులు పెట్టింది. ‘ఇది నీలోని innocenceకి’ అంటూ అతడి పెదవులను తన పెదవులతో పెనవేసి గాఢమైన ముద్దు పెట్టింది. ఆ ముద్దు కిరీటిలో సెక్సువల్ ఫీలింగ్ కలిగించలేదు. అది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఇచ్చిన ముద్దు. అందులో కామం లేదు, ఒక ఆర్తి మాత్రమే వున్నది.
‘సునయనా, నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. నేను మీకు ఏమి ఇవ్వగలను?’
ఆమె అతడి గుండెపై చెయ్యి వేసి ‘నీ innocenceని ఇక్కడ పెట్టి తాళం వెయ్యి. ఆ తాళం ఎక్కడైనా పారెయ్యి. నీ దగ్గర ఆ innocence వున్నంత కాలం నా ముద్దు నీ దగ్గర వుంటుంది. అది కోల్పోయావో, నువ్వు నాలా అవుతావు. నాలాగా ఎప్పటికీ తయారవకు’ అంటూ అతడ్ని కరుచుకుపోయింది.
కిరీటిది చాలా చిన్న పరిధి. వేనవేల పల్లెటూళ్ళల్లో ఓ పల్లెటూరు ఈ పెంచలాపురం. అందులో శతకోటి లింగాల్లో మానవాడొక బోడి లింగం. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఈ అమ్మాయి అంతటి కాంప్లికేటెడ్ మనిషిని ఎప్పుడూ చూడలేదు. కొంతసేపటి క్రితం వరకూ కూడా ఆమెపై ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే వుంది. కానీ ఇప్పుడో… ఇప్పుడు సునయన అతని హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. ఇట్లాంటి అమ్మాయితో ఈ అనుభవం తర్వాత మామూలు ఆడపిల్లలు ఇక జీవితంలో నచ్చలేదు అతనికి. ఇది అతనిలో వచ్చిన మొదటి మార్పు.
ఆమె గురించి ఎంతో తెలుసుకోవాలని వుంది కిరీటికి. ఆమె మూలాలు ఎక్కడ వున్నాయి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చదువు, ఇష్టాయిష్టాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో అడగాలని వుంది. కానీ పర్సనల్ డీటైల్స్ అడిగితే వేటగాడ్ని చూసిన జింకపిల్లలా పారిపోతుంది అని ఒక బలమైన నమ్మకం మటుకు కుదిరింది అతనికి. బలవంతాన అడిగేకంటే తనంతట తను చెప్పిన దాంట్లో ఏమన్నా సమాచారం దొరుకుతుందేమో చూద్దాం అని డిసైడ్ అయ్యాడు.
‘ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడైనా ఇటు వస్తారా?’ అని కిరీటి అడిగితే ‘తెలీదు. ప్రస్తుతానికి నా నుంచీ ఏమీ ఆశించకుండా నా మానప్రాణాల్ని కాపాడేది ధనుంజయ్ ఒక్కడే. అందుకే అతను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను’ అంది.
మళ్ళీ కాసేపు మౌనం రాజ్యమేలింది అక్కడ. ‘నాక్కూడా ఇదే మొదటి ముద్దు తెలుసా?’ అని ఆమె అంటే కిరీటి ఆమె భుజాలపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఈ సారి వారి ముద్దులో గాఢత ఇంకాస్త ఎక్కువగా వుంది. ఇద్దరూ మాటలతో చెప్పలేని భావాల్ని ఇలా పెదాలతో పంచుకున్నారు.
‘ఎప్పటికైనా ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరు ఎక్కువగా ఏ వూళ్ళో వుంటారో కనీసం అదొక్కటైనా చెప్పండి’ అన్నాడు. ఆమె అతని చెవిలో ఒక మాట చెప్పింది. విని మౌనంగా తల ఊపాడు.
ఇద్దరూ ఒకరిని ఒకరు వీడి పోవటానికి సిద్ధంగా లేరు. కానీ సమయం ఎవరి కోసమూ ఆగదు కదా. ఎవరి దారిన వారు పోయే సమయం వచ్చింది. ‘పాడు పిల్లడా, నన్ను ఏడిపించావు. చూడు నా ముఖమంతా అసహ్యంగా తయారయ్యింది. ముఖం కడుక్కోవాలి, నీళ్ళెక్కడుంటాయో చెప్పు. కాస్త జనం లేని చోట సుమా’ అంటే ‘బస్టాండ్ దగ్గర పంచాయితీ కుళాయి వుంది రండి. నాకు తెలిసి ఈ రాత్రి బస్సులో మీ ఇద్దరే ప్రయాణికులు’ అంటూ ఆమెను అక్కడకు తీసుకుపోయాడు.
కుళాయి దగ్గర ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ధనుంజయ్ కోసం వేసి చూస్తున్నారు ఇద్దరూ. ‘నేను wait చేస్తానులే ఇక్కడ. చీకటి పడిపోయింది. నువ్వు ఇంటికి పోవా?’ అంటే ‘మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తాలెండి. దార్లన్నీ నాకు కొట్టిన పిండే’ అన్నాడు.
‘నువ్వేమన్నా నా చుట్టానివా? నేను పండక్కి మీ ఊరోస్తే సాగనంపినట్టు ఏమిటి ఇదంతా, పో పో’ అని నవ్వింది సునయన. ‘అలాంటిదే అనుకోండి. అదుగో మీ ఫ్రెండ్ ఎలాగూ వచ్చేస్తున్నాడు’ అంటూ పెట్టె మోసుకొస్తున్న ధనుంజయ్ ను చూపించాడు.
‘నువ్విక్కడుంటే నేను బస్ ఎక్కేటప్పుడు మళ్ళీ ఏడుస్తాను. వెళ్లిపోవా ప్లీజ్’ అని అడిగింది సునయన.
ఇక ఆ మాటకి ఎదురు చెప్పలేకపోయాడు కిరీటి. ‘గుడ్ బై’ అని షేక్ హాండ్ ఇచ్చి ఆమె చెయ్యి మెల్లగా నొక్కి మరి వెనుతిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. వెళ్ళేటప్పుడు ఎదురుపడ్డ ధనుంజయ్ కి చెయ్యి ఊపి సైకిల్ స్టాండ్ వైపు వెళ్ళాడు.
‘కుర్రాడు special అని ఇప్పటికైనా ఒప్పుకుంటావా?’ అని ఆమె పక్కన కూలబడుతూ అడిగాడు ధనుంజయ్. ‘జరిగిందంతా నక్కి నక్కి చూసేసి ఇప్పుడు మళ్ళీ నన్ను అడగటం ఎందుకు? He is a gem. ఎక్కువ రోజులు బతకలేడు ఊరు దాటి వెళ్తే. ఇంత మంచి వాళ్ళని లోకం పీక్కుతినేస్తుంది’ అంది సునయన. ఆమె కళ్ళల్లోంచి మళ్ళీ నీళ్ళు కారిపోతున్నాయి.
ధనుంజయ్ ఆమె భుజం తట్టి ఓదార్చాడు. ‘Control yourself Sunayana… నీకు తెలుసు కదా, మన line of work లో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకూడదు. ఎడారిలో నడిచేవాడికి దగ్గర్లో ఒయాసిస్ వుందన్న ఊహే కొండంత బలం. ఈ కిరీటి నీ మనసుకి ఒయాసిస్ లాంటివాడు అనుకో. లోకం మరీ దారుణంగా అనిపించినప్పుడు ఈ అబ్బాయిని గుర్తు తెచ్చుకో. He will be a source of strength for you. అలాగే ఎడారిలో బతకాలంటే ఒయాసిస్ లో నీళ్ళు తాగాలి. మన పనిలో ఒకవేళ అవసరం ఐతే ఈ అబ్బాయిని వాడుకుంటావు కదా?’ అని అడిగాడు.
సునయన కళ్ళల్లోంచి ఉబుకుతున్న నీటిని తుడుచుకుంటూ ‘ఊ’ అని చెప్పింది.
‘మనం ఈ ఊరు వచ్చిన పని పూర్తి అయినట్లేనా’ అడిగాడు ధనుంజయ్. ‘ఆ, అనుకోకుండా పరిచయం ఐనా మనకు కావాల్సిన చాలా డీటైల్స్ కిరీటే చెప్పాడు. మిగతా వాళ్ళ దగ్గర విన్నట్లే ఈ ఊళ్ళో పంచలోహ విగ్రహం వున్నది నిజం. అన్నిటికంటే ముఖ్యమైన detail. పండుగ టైమ్ లో కాక మిగతా రోజుల్లో విగ్రహం ప్రెసిడెంట్ గారి ఇంట్లో పెట్టి వుంచుతారుట’ అని చెప్పింది సునయన.
‘గుడ్, గుడ్. మన పని మనం చేశాం. మిగతా అంతా వినయ్ చేతిలో వుంది. విగ్రహం దొంగిలించడం ఎలా అన్నది అతగాడికి వదిలిపెడదాం’