తను చేసిన పిచ్చి పనులు చెప్పుకొని, క్షమించమని అడగాలని చెబుతోంది కమలిని మనసు. ధైర్యం చాల్లేదు. దానికి బదులుగా “నేను కూడా నీతో వొచ్చేస్తా. నువ్వక్కడ, నేనిక్కడ.. ఇట్లా ఎంత కాలం? నువ్వొచ్చేదాకా వారాల పాటు ఎదురుచూస్తూ ఉంటం నా వల్ల కావట్లేదు” – ఆమె. అతనిలో కాస్తంత ఆశ్చర్యం. నవ్వొచ్చింది. ఆమెకు కనిపించకుండా పెదాల మాటున అదిమిపెట్టి “ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో కుదరదు. ఒక్కటే గది. ఇద్దరికీ సౌకర్యంగా ఉండే ఇల్లు చూస్తా. అప్పుడు వొద్దువుగానీలే” – అతను.
దూర ప్రయాణం చేసి అలసివుంటంతో నిద్ర ముంచుకువొస్తోంది. వెళ్లి పడుకున్నాడు. ఆ పూట అతడితో కాసేపు కబుర్లు చెప్పాలనీ, మనసు విప్పాలనీ కమలిని ఆరాటం. “ఏమైనా కబుర్లు చెప్పకూడదూ? కొట్టాయం ఎట్లా ఉందో, అక్కడి మనుషులు ఎట్లా ఉంటారో, నీకు అక్కడ ఎట్లా అనిపిస్తున్నదో చెప్పొచ్చు కదా. ఎప్పుడూ రావడం, అలసిపోయానని పడుకోడం. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఇన్నాళ్లూ నేను ఏమీ అడగలేదు. ఇవాళ పౌర్ణమి. డాబా పైకెళ్లి పడుకొని, కాసేపు కబుర్లు చెప్పుకుందాం” – కమలిని. తట్టింది, అతడి భుజంపై. లేద్దామనుకున్నాడు. మనసు ఎదురు తిరిగింది. ఆమె నటిస్తోందనీ, తనకు అనుమానం రాకుండా ప్రేమ వొలకబోస్తోందనీ ఊహ. “ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. నిద్ర ఆగట్లేదు” – శేఖర్. ఆవులించాడు. కళ్లు మూసుకున్నాడు. కమలినికి తన్నుకొస్తోంది, ఏడుపు. చప్పుడు చెయ్యకుండా డాబా పైకెళ్లి చాపమీద పడుకుంది. ఆమె కన్నీళ్లతో తడిసి దిండు ఉక్కిరిబిక్కిరి. * * * ఇప్పుడు కోజికోడ్‌లోని సెంట్రల్ లైబ్రరీకి బానిస శేఖర్. ప్రపంచ సాహిత్యం చదువుతుంటే ఇంకా ఇంకా విశాలమవుతూ మనసు. అక్కడికెళ్లే సమయం చిక్కకపోతే కొట్టాయంలోని పబ్లిక్ లైబ్రరీకెళ్లి ఇంగ్లీష్ పత్రికలు చూస్తున్నాడు. కొట్టాయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వెన్నిమాల, మాతృమాల అనే కొండ ప్రాంతాలకు వెళ్లి సాయంత్రాలు కాలక్షేపం చేస్తున్నాడు. థామస్ మరింత దగ్గరయ్యాడు. అతను లేకుండా ఒంటరిగా వెళ్లాలనుకున్నప్పుడు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాన్ని తీసుకుపోయి, అక్కడ చదువుకుంటుంటే మనసు వెలిగిపోయేది. కొట్టాయం దగ్గరలోనే ఉన్న తిరునక్కర మహాదేవ ఆలయం (శివాలయం)కు అప్పుడప్పుడూ వెళ్లొస్తున్నాడు. అక్కడ మరో రెండూళ్లు తెగ నచ్చేశాయ్. ఒకటి కల్లర, రెండు రామాపురం. కల్లరలో ఎటు చూసినా యేర్లు, వరిపొలాలు, ప్రాచీన గుళ్లు, చర్చిలు. ఎళుమంతురూత్ యేటిలో పడవపై ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోయాడు.
రామాపురం ఓ చారిత్రక స్థలం. రామాపురత్తు అనే యోధుడి జన్మభూమి. ప్రఖ్యాత మలయాళ రచయిత్రి లలితాంబిక నివసించిన ఊరు. అక్కడ రామాలయం ఉంది. ఆ గుడికి చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో భరత, లక్ష్మణ, శతృఘ్న గుడులున్నాయి. అన్నింటినీ దర్శించాడు. లలితాంబిక రాసిన ఏకైక నవల ‘అగ్నిసాక్షి’ ఫేమస్ అనీ, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వొచ్చిందనీ తెలుసుకొని, దాని ఇంగ్లీష్ అనువాదం చదివాడు. “ఏమిటి విషయం?” – థామస్, ఒక రోజు. “ఏ విషయం?” – శేఖర్. “సెలవులు వొస్తున్నా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నావ్. పుస్తకాలు తెగ తిరగేస్తున్నావ్. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చుట్టబెట్టేస్తున్నావ్. ఏంటి కత?” – థామస్. బలహీనంగా నవ్వుతూ, మౌనంగా శేఖర్. “నువ్వెళ్లకపోతే పోయావ్. నీ వైఫ్‌నైనా తీసుకొచ్చేయొచ్చుగా. నువ్విక్కడ, ఆమేమో అక్కడ. ఏం బాలేదు. ఇట్లా ఎంత కాలం?” – థామస్.
“ఆమె కూడా అదే అంటోంది. చూడాలి” – శేఖర్. థామస్ ఇక పొడిగించలేదు. నిజానికి అతను శేఖర్‌తో మాట్లాడాలనుకున్నది ఆ విషయం కాదు. “శేఖర్, నేను ‘నవజీవన్’ అనే ఓ సేవా సంస్థను ప్రారంభించాలనుకుంటున్నా. దానికి నా స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం ఉంటే సక్సెస్‌ఫుల్‌గా చేస్తాననే నమ్మకం ఉంది” – థామస్. “నవజీవనా. బాగుంది. దానితో ఏం చేద్దామని?” – శేఖర్. “అనాథలు, శారీరక, మానసిక వికలాంగులు ఎంతోమంది అనారోగ్యాలతో సరైన వైద్యం లభించక చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లకు మన హాస్పిటల్లోనే ట్రీట్‌మెంట్ ఇప్పించి, ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. కేవలం వైద్యమే కాదు, వాళ్లకు ప్రేమానురాగాల్నీ అందించాలి. తద్వారా వాళ్లకు అందరిలా జీవితాన్ని కొనసాగించే ఏర్పాటు చెయ్యాలనేది నా సంకల్పం” – థామస్. “ఎంత గొప్ప సంకల్పం!” – శేఖర్, అప్రయత్నంగా. అతనిలో చాలా సంభ్రమం. ఇట్లాంటి ఆలోచన థామస్‌కు ఎట్లా వొచ్చింది? తనేమో సొంత సమస్యతో తెగ సతమతమైపోతూ, దాన్నుంచి ఎట్లా బయటపడటమా అని ఆలోచిస్తుంటే, థామస్ నలుగురికీ మంచి చేసే పని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచన రావడం సరే, దాన్ని ఆచరణలోకి తీసుకు రావాలంటే ఎంత శ్రమ చెయ్యాలి! ఎంత ఓపిక కావాలి!!
“ఆలోచనదేముంది శేఖర్. ఆచరణ ముఖ్యం. వాళ్ల వైద్యానికి అయ్యే ఖర్చును భరించాలి. అందుకోసం నా జీతంలో పాతిక వంతును దీనికోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా. పైగా ఇక్కడున్నంత కాలం వాళ్లకు ఆహారాన్ని ఏర్పాటుచేయడం కూడా ప్రధానమే. అందుకే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలి.
ఇప్పటికే కొంతమంది నెలనెలా కొంత విరాళంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు. మన నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్, మెడికల్ స్టాఫ్ కూడా ఖాళీ టైంలో పేషెంట్స్‌కు ఉచితంగా సేవ చేస్తామని మాటిచ్చారు” – థామస్. అతని ముందు తాను మరుగుజ్జు అయిపోయిన భావన శేఖర్‌లో. “నువ్వు తలపెట్టింది చిన్న పనికాదు థామస్. నీకు సంసారముంది. పిల్లలున్నారు. సొంత కుటుంబం చూసుకోడానికే కష్టమైపోతోందని అందరూ చెబుతుంటారు. అట్లాంటిది ఇతరుల కోసం ఇంత పెద్ద పని తలకెత్తుకోడం, దాని కోసం టైం కేటాయించడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో గొప్ప మనసు కావాలి. నీది ఖచ్చితంగా గొప్ప మనసు.
నీకు నేనెలా ఉపయోగపడగలనో చెప్పు. తప్పకుండా చేస్తా” – శేఖర్. థామస్ మొహంపై నవ్వు. “మరీ అంతగా పొగడకోయ్. ఇది నేనొక్కణ్ణే చేస్తున్నానా. చాలామంది సాయం తీసుకుంటున్నా. నువ్వనుకుంటున్నట్లు ఇది ఇప్పటికిప్పుడు నాలో కలిగిన ఆలోచన కాదు. నేను కుర్రాడిగా ఉన్నప్పట్నించీ ఉన్నదే. ఓ రోజేమైందో తెలుసా? మా నాన్నకు విపరీతమైన కడుపునొప్పి వొచ్చింది. మా ఊళ్లో ఆస్పత్రి లేదు. జిల్లా ఆస్పత్రికెళ్లాలంటే పది కిలోమీటర్లు ప్రయాణించాలి. నాన్నను బస్సులో తెచ్చేసరికి హాస్పిటల్ మూసేశారు, టైం అయిపోయిందని. ఆ రోజంతా ఆస్పత్రి వరండాలోనే ఉన్నాం. కడుపునొప్పితో విలవిల్లాడుతున్న నాన్నను పరీక్షించిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నాడు. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు మా వద్ద లేదు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్లో ఉన్న పేషెంట్సే తలా కొంచెం చందాలు వేసుకొని ఆదుకున్నారు. మానవత్వాన్ని ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశా. అప్పుడే అనుకున్నా. ఆపదలో ఉన్న పేషెంట్స్‌ను ఎలాగైనా ఆదుకోవాలని. ఇప్పటికి అది కొలిక్కి వొచ్చింది. సరే.. ఈ పనిలో నువ్వెలా భాగం కావాలనుకున్నా సంతోషమే. డబ్బు సాయం చెయ్యొచ్చు. అనాథలను హాస్పిటల్‌కు తేవడంలో మాకు తోడ్పాటునీయొచ్చు” – వివరంగా, థామస్.
“రెండూ చేస్తా. నీకేమైనా అభ్యంతరమా?” – మనస్ఫూర్తిగా, శేఖర్. ‘నవజీవన్’ పని మొదలైంది. మొదటి రోజు అన్నదానానికి కిలో బియ్యం సరిపోయింది. నెల రోజులు గడిచేసరికి అది పది కిలోలకు పెరిగింది. రోగుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన వాళ్ల కోసం ఓ అద్దె ఇల్లు తీసుకున్నారు. దానికి ‘నవజీవన్ భవన్’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు శేఖర్‌కు ఖాళీ సమయం ఉండట్లేదు. హాస్పిటల్ డ్యూటీ అవగానే నవజీవన్ భవన్‌కు వొచ్చేస్తున్నాడు. జబ్బు నయం అయిన అనాథ పిల్లలను ఎర్నాకుళంలోని శిశుభవన్‌కు తీసుకెళ్లే బాధ్యతను అతనే చూసుకుంటున్నాడు. ఈ పనిలో పడి రెండు నెల్లపాటు హైదరాబాద్ రావడానికి అతనికి వీలు చిక్కలేదు. * * *
రోజురోజుకూ పెరిగిపోతోంది, కమలిని మనసులో అశాంతి. శేఖర్ ప్రవర్తనతో పిచ్చిపడుతుందేమో అన్నట్లుంది. తన విషయం అతడికి తెలిసిపోయిందనే నమ్మకం గట్టిపడింది. అంతకు ముందే దూరం పెట్టేసింది శ్రీనాథ్‌ను. ఒకసారొచ్చి “ఏమైంది నీకు? పద. స్వాగత్‌కు వెళ్దాం. నీ బాధేంటో చెబ్దువు గానీ” – శ్రీనాథ్. “ముందు ఇక్కణ్ణించి వెళ్లు. పిచ్చి తలకెక్కి ఇంతదాకా నీతో తిరిగింది చాలు. ఇంకొంచెంసేపు ఇక్కడే ఉన్నావంటే అల్లరి పెడుతున్నావని గోలచేస్తా” – కమలిని, స్థిరంగా. ‘నువ్వూ, నేనూ కలిసి తిరగడం ఇక్కడివాళ్లకంతా తెలుసు. గోల చేసుకో. ఎవరూ నమ్మరు’ అందామనుకున్నాడు. ఆమె మొహంలోని నిజాయితీ ఆపేసింది. తనను ఇంతదాకా శారీరకంగా ఆమె హద్దుల్లోనే ఉంచిందన్న నిజం జ్ఞాపకమొచ్చింది. ఆమె వొంక అలాగే కొన్ని క్షణాలు చూసి, మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అతడు తనకు కొనిచ్చిన వస్తువులన్నింటినీ అతడింట్లో పడేసి వొచ్చింది కమలిని.
2002 ఆగస్ట్ 7. ఉదయం నుంచీ ఒకటే వాన ముసురు. గద్దర్ ఇంటి ముందు ఆగింది ఆటో. కమలిని దిగింది. ఆ టైంలో ఇంట్లోనే గద్దర్. హాల్లో నలుగురైదుగురు రచయితలు, కవులు. అప్పటి రాజకీయాల గురించీ, సాహిత్యం గురించీ చర్చ. మధ్యమధ్యలో గద్దర్‌తో పాటు ఇంకో కవి నోటివెంట ఆశువుగా పాటలు. ఎవరో యువతి గబగబా గేటు తీసుకుని రావడం హాల్లోంచి చూశాడు గద్దర్. తలుపు తెరిచే ఉంటంతో నేరుగా హాల్లోకొచ్చి గద్దర్‌కు నమస్కారం పెట్టింది కమలిని.
“దండాలు తల్లీ. ఎవరమ్మా నువ్వు. అట్లా కూర్చో” – చాప చూపిస్తూ, గద్దర్. అక్కడున్నోళ్లంతా చాపలపైనే కూర్చుని ఉన్నారు. ఆమెకు గద్దర్ తప్ప మిగతా వాళ్లెవరూ తెలీదు. కమలినిలో మొహమాటం. గమనించాడు గద్దర్. “వీళ్లంతా మనవాళ్లేనమ్మా. మంచి రచయితలు, కవులు. మొహమాటపడకుండా చెప్పు” – గద్దర్. “నా పేరు కమలిని అండీ. మీరంటే మా ఆయనకు చాలా ఇష్టం” – కమలిని. “అవునా. ఎవరు మీ ఆయన?” – గద్దర్. “శేఖర్. మీరప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని చూసొచ్చిందాకా నిలవలేకపోయాడండీ” – కమలిని. “మంచిది తల్లీ. ఎందుకొచ్చావో చెప్పు. ఆ పోరగాడికేమీ కాలేదు కదా. అతను లేకుండా ఒక్కదానివే వొచ్చావంటే ఏదో పెద్ద గడబిడ అయ్యుంటుంది” – గద్దర్. ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. “ఈ తల్లికి నిజంగానే ఏదో కష్టమొచ్చినట్టుంది గద్దరన్నా. ఫర్లేదు చెల్లెమ్మా. మేమంతా నీ అన్నల్లాంటోళ్లమే. నీ బాధేందో చెప్పరాదే” – ఒకతను. “గోరటి ఎంకన్న పేరు వినుంటావులే తల్లీ. ఇతనే ఆ ఎంకన్న. చెప్పు బిడ్డా. శేఖర్ ఏడున్నాడు?” – గద్దర్. ధైర్యం తెచ్చుకొని పది నిమిషాల్లో తన కథంతా చెప్పింది. “నేను తప్పుచేశాను. దాన్ని దిద్దుకోవాలనుకుంటున్నా. ఎలాగో తెలీడం లేదు. రెండు నెలలు దాటిపోయింది. మనిషి రావట్లేదు. నాలుగైదు రోజుల క్రితం ఫోన్‌చేసి అడిగితే వొస్తానన్నాడు. అతను రాలేదు కానీ మనియార్డర్ వొచ్చింది. తను నా మొహం చూడ్డానిక్కూడా ఇష్టపడట్లేదని అర్థమైంది. నాకు శేఖర్ కావాలి. అతనెక్కడెంటే నేనూ అక్కడే. అతన్ని ఇంకెప్పుడూ కష్టపెట్టే పని చెయ్యను. ఆ విషయం నేను చెబితే నమ్మడు. మీరు చెబితే నమ్ముతాడు. మీరు ఆయనకు దేవుడికిందే లెక్క. అందుకే వెతుక్కుంటూ మీ వద్దకొచ్చాను” – కమలిని. రెండు మూడు నిమిషాల నిశ్శబ్దం. గద్దర్ వద్దకు ఈ రకమైన పంచాయితీ ఇదివరకెప్పుడూ రాలేదు. కమలిని గొంతులో, మొహంలో నిజాయితీ తోచింది అందరికీ. “అన్నా, ఈ బిడ్డ చేసిన తప్పు తెలుసుకుంది. ఇక నుంచీ మంచిగా ఉంటానంటోంది. సాయం చెయ్యన్నా” – వెంకన్న. గద్దర్ నవ్వాడు. కమలిని తలమీద చేయేసి “నిజం నిన్ను నీడగా వెంటాడుతున్నదే తల్లీ. ఇవాళ నువ్వే కాదు, ఎంతోమంది మార్కెట్ మాయలోపడి విలాసాలకు బానిసలవుతున్నారమ్మా. జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అనుబంధాల్నీ, ఆత్మీయతల్నీ విస్మరిస్తున్నారు. నువ్వు చాలా త్వరగానే నీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. శేఖర్ సంగతి నేను చూసుకుంటా. అన్నంతినెళ్లు తల్లీ” – గద్దర్. * * *
మరోసారి ఆగస్ట్ 15కి. తెల్లవారితే 16. ఒంటిమీదున్న రగ్గుతీసి అవతలకు నెట్టాడు శేఖర్. ఒళ్లంతా చెమట్లు. పక్కకు చూశాడు. కమలిని లేదు. లేచాడు. విపరీతమైన నీరసం. గద్దర్ ఫోన్ చేయడం, రాత్రి తను రావడం, కమలిని తనకు సపర్యలు చెయ్యడం.. అన్నీ జ్ఞాపకానికొచ్చాయి. ఆమె కన్నీటి చుక్క తన చేతిపైపడ్డం జ్ఞాపకానికొచ్చింది. ఆమె తప్పు తెలుసుకుందా? పశ్చాత్తాపపడుతోందా? లేక తన స్థితికి బాధపడుతోందా? ఆమె దుఃఖానికి రెండూ కారణమేనా? మంచం మీంచి దిగాడు. ముందు గదిలో వెల్తురు. చప్పుడు చెయ్యకుండా కిటికీ రెక్కను నెమ్మదిగా తెరిచాడు. కింద కూర్చొని పేపర్‌పై ఏదో రాస్త్తూ, కమలిని. మధ్య మధ్య కళ్లు తుడుచుకుంటూ… ఆ ఒక్క దృశ్యం.. ఆ ఒకే ఒక్క దృశ్యం.. ఎన్నో విషయాలు చెప్పింది. సందేహమే లేదు. ఈ కమలిని, మునుపటి కమలిని కాదు. తన కమ్ము! ఆమెపై ప్రేమ ఉప్పెనలా తోసుకువొస్తుంటే.. తన కళ్లు తడవటం అతడు గమనించలేదు. ఒళ్లు స్వాధీనంలో లేని విషయం పట్టించుకోలేదు. తలుపు తోశాడు. “కమ్మూ!” అంటా ఒక్క ఊపున వెళ్లాడు. ఆమెలో ఉలికిపాటు. రాస్తున్న పేపర్‌ను దాచబోయింది, కంగారుగా. పేపర్ ఆమె మాట వినలేదు. చేతిలోంచి జారి కిందకి. ఆమె తియ్యబోతుంటే, చటుక్కున దాన్నందుకున్నాడు. ఆమె కన్నీళ్లతో తడిసిన ఆ పేపర్‌లోని అక్షరాల వెంట అతని కళ్లు పరుగులు. “శేఖర్ నన్ను క్షమించు. నీకు తీరని ద్రోహం చేశాను. నువ్వెంత మంచివాడివి. నాపై ఎంత ప్రేమ చూపావు. కానీ నేను ఆడంబరాల్లో, షోకుల్లో సుఖముందనే భ్రమల్లో మునిగాను. నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను. ఎండమావుల వెంట పరుగులు పెట్టాను. నా సంగతి తెలిసి కూడా తెలియనట్లు ఉంటున్నావని అర్థమైంది. నీ స్థానంలో ఇంకెవరున్నా అదే రోజు నాతో తెగతెంపులు చేసుకునేవాడు. లేదంటే ఆ చెంపా, ఈ చెంపా వాయించేవాడు. నీది అతి మంచితనం. నేను దారి తప్పుతున్నానని తెలిసి కూడా ఆ బాధను నీలోనే దాచుకొని, ఎంతగా కుమిలిపోతున్నావో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో. ‘ఇట్లాంటిదాన్నా.. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందీ’ అని ఎంతగా వేదన చెందుతున్నావో. నీ బాధ, వేదన న్యాయమైనవి. మానసికంగా నిన్నెంత క్షోభపెట్టానో తలచుకుంటుంటే నాపై నాకే పరమ అసహ్యం వేస్తోంది. నిజమైన సుఖమేమిటో, ప్రేమేమిటో తెలిసేసరికి నువ్వు నాకు చాలా దూరమైపోయావ్. నేను తప్పు చేశాననేది నిజం. కానీ నేను వ్యభిచారం చెయ్యలేదు. నీతో జరగని సరదాలను తీర్చుకోవాలనుకున్నానే కానీ ఈ శరీరాన్నీ, మనసునీ నీకు తప్ప ఇంకెవరికీ అర్పించలేదు. సంజాయిషీ కోసం ఈ సంగతి చెప్పడం లేదు. నీకు నిజం తెలియాలనే చెబుతున్నా. ఇదే సంగతి నువ్వు అభిమానించే గద్దర్‌గారికి చెప్పి, కొంత ఉపశమనం పొందాను. ఆయన మాటతోనే ఇప్పుడు నువ్వొచ్చావని తెలుసు. కానీ ఇందాక నువ్వు పలవరించినప్పుడు అర్థమైంది, నీ హృదయం ఎంతగా గాయపడిందో, ఎంతగా క్షోభించిందో. ‘కమ్మూ, ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే భరోసా అనుకున్నా. నువ్వేమో డబ్బులోనూ, ఆడంబరాల్లోనూ, సరదాలు, షికార్లలోనూ ప్రేమ ఉందనుకుంటున్నావ్. నన్నేందుకు మోసం చేశావ్?’ అని నిద్రలోనే అడిగావ్. నీతో కలిసి బతికే అర్హత నాకులేదని అర్థమైంది. అందుకే…” అంతవరకే రాసింది. ఆ తర్వాత కన్నీటి చుక్క పడ్డట్లు తడిసింది పేపర్. కమలిని వొంక చూశాడు శేఖర్. తల అవతలకు తిప్పుకొని ఉంది, తన మొహం అతడికి చూపించే ధైర్యంలేక. తన ప్రమేయం ఏమీ లేకుండానే, తనేమీ అనకుండానే ఆమె తన తప్పు తెలుసుకుంది. కమలిని ఇప్పుడు మారిన మనిషి. ఆమెకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అది చెయ్యలేడా? ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆమె తలను చేతుల్లోకి తీసుకున్నాడు. “కమ్మూ, నన్ను వొదిలిపెట్టి నీ దారిన నువ్వు పోదామనుకుంటున్నావా? నేనేమైపోవాలనుకున్నావ్?” అంటా ఆమె పెదాలపై, నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు. తడిసిన కన్నులను పెదాలతో అద్దాడు. కన్నీటి చుక్కలు ఉప్పగా ముద్దాడాయి. రెండు చేతులూ అతడి వీపు వెనుగ్గా పోనిచ్చి మళ్లీ ఎవరైనా తమను వేరు చేస్తారేమోననే భయం ఉందేమో అన్నట్లుగా గట్టిగా, బలంగా శేఖర్‌ను వాటేసుకుంది కమలిని. -బుద్ధి యజ్ఞ మూర్తి