నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 20

“ఇంకా అరగంట టైం వుంది అజయ్!” “ఇంకా-నా గురూ?!” మధ్యాహ్నం పన్నెండు గంటల నించీ రాజ్యలక్ష్మీ కాలేజీ ముందర సౌమ్య కోసం ఎదురుచూస్తున్నారు వాళ్ళు.

సౌమ్యని ఒంటరిగా కలవడానికి యింకా ధైర్యం చాలని అజయ్ శిరీష్ ని కూడా వెంట తెచ్చుకున్నాడు గడుస్తున్న ప్రతిక్షణం ఒక యుగాన్ని తలపిస్తుండటంతో జీప్ దిగి రోడ్డు మీద అటు ఇటు తచ్చాడసాగాడు. “హ్మ్… ఎప్పుడో చదువుకునే రోజుల్లో అనుకుంటా, ఇలాగే కాలేజీ వదిలేప్పుడు అమ్మాయిలని చూడ్డానికి పడిగాపులు కాసేవాళ్ళం! ఇదుగో మళ్ళా ఇన్నాళ్ళకి—” “అబ్బా గురూ! అదంతా ఇప్పుడు గుర్తు చెయ్యకు! నేనిప్పుడేమీ ఆలోచించలే—” అన్నాడు వేడుకోలుగా. “—హా… ఆలోచన… అంటే జ్ఞాపకమొచ్చిందీ, సులోచన గుర్తుందారా?” ఆ పేరు వినగానే అజయ్ కాస్త డైవర్ట్ అయ్యి శిరీష్ ని చూసి నవ్వు మొహంతో— “ఎలా మర్చిపోతాం గురూ? అప్పట్లో దానికోసం మన బ్యాచ్ మొత్తం ఆ లేడీస్ కాలేజీ ముందరే పడిగాపులు కాసేవాళ్ళం కదా!” అన్నాడు. “అంతేనా…! బీచ్ రోడ్డు వెంబడి తను పోతుంటే మీరంతా వెనకాలే క్యూ కట్టేవాళ్ళు కూడా!” “హహ్హా… అదేమైనా తక్కువ తిందా గురూ! యింటివరకు సిటిబస్ ఫెసిలిటీ వున్నా దొంగముండ కావాలనే నడిచి వెళ్ళేది… అందరినీ అలా తన వెంట తిప్పుకోవటానికి!” “హ్మ్… ఏఁవైనా అప్పట్లో అదో సరదాలేఁరా!” అంటూ నవ్వాడు. అజయ్ కూడా నవ్వేశాడు. అలా వాళ్ళు తమ కాలేజీ విషయాలను నెమరవేసుకుంటుండగా ఇక్కడ కాలేజీ విడిచిపెట్టడంతో అమ్మాయిలు అందరూ గుంపులు గుంపులుగా బయటకి రాసాగారు. రోజూ షరామామూలుగా కాలేజీ ముందు కనిపించే అల్లరి కుర్రమూకలు ఇవ్వాళ అక్కడ అస్సలు కనపడకపోవడం అక్కడి అమ్మాయిలకి వింతగా తోచింది— “ఏంటే ఇవ్వాళ విశేషం…. ఒక్కడు కూడా లేడు!” లోపలి నుంచి బయటకి వస్తూ ఒక అమ్మాయి తన స్నేహితురాలితో బిగ్గరగా అనటం అజయ్, శిరీష్ ల చెవిన పడింది. అటేపు చూశారు వాళ్ళు. ఆ మాట్లాడుతున్న అమ్మాయి ప్రక్కనే నడుస్తూ వస్తోంది ‘సౌ-మ్య’. అజయ్ గుండె రెండు అంగుళాలు క్రిందకి జారిపోయింది. బిగుసుకుపోయి రెప్పవేయకుండా ఆమెనే చూడసాగాడు. ఎందుకో తెలీదు, అతని కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి! అంతలో సౌమ్యకి మరో ప్రక్క నడిచి వస్తున్న అమ్మాయి, “అదుగో చూడండేఁ… పోలీస్ జీప్!” అంది. వాళ్ళు తలలు త్రిప్పి చూశారు. సౌమ్య దృష్టి అజయ్ మీద పడింది. ఆమె ముఖంలో ఏ భావమూ ప్రకటితమవటం లేదు. “హ్మ్… అందుకేనేమో, ఇవ్వాళ ఎవడూ రాలేదు!” అంది ఆ మొదట అమ్మాయి కూసింత నిరాశగా! అజయ్ ని చూసినా చూడనట్టుగా తన స్నేహితురాళ్ళతో కలిసి ముందుకు నడవసాగిందామె. అతనికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతసేపు ఎదురుచూపులూ నీళ్ళపాలవుతుండటంతో వెనక్కి తిరిగి అసహనంగా తన గురువుని చూశాడు. శిరీష్ కి అజయ్ పరిస్థితి అర్ధమైంది. అభయం ఇస్తున్నట్లుగా తన చేతిని పైకెత్తి ‘వెళ్ళి మాట్లాడరా’ అని కళ్ళతోనే సైగ చేసి ఆ ఎత్తిన చేత్తో గట్టిగా అజయ్ ని ఒక్క తోపు తోసాడు. అజయ్ గభాల్న ఒక్కడుగు ముందుకు తుళ్ళి తమాయించుకుని ఒక్కసారి గొంతుని సవరించుకుని, “సౌమ్య-గారు!” అంటూ ఆమెను పిలిచాడు. సౌమ్య నడుస్తున్నదల్లా ఆగి తలత్రిప్పి అతన్ని చూసింది. ఆమె చుట్టుప్రక్కల వున్న స్నేహితురాళ్ళు కూడా ఆగిపోయారు. అజయ్ ఒక్కసారి గాఢంగా ఊపిరి తీసుకుని ఆమెని సమీపించాడు. ఆమె తన చేతిలో ఉన్న పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని నిలుచునుంది. “అ…మ్… అఁ… హ్… అదీ… మ్.మ్మీ-రూ—” కంట్రీ బూతులన్నీ కలగలిపి భాషని అనర్గళంగా మాట్లాడేంత టంగ్ పవర్ వున్న టఫ్ కి కనీసం ఒక్క మాట కూడా సరిగ్గా నోటివెంట రావటం లేదిప్పుడు! అతనలా తడబడటం చూసి సౌమ్య పక్కన నిలుచున్న అమ్మాయిలు ముసిముసి నవ్వులు చిందించసాగారు. దాంతో, “అటు ప్రక్కకి వెళ్దాం పదండి!” అంది సౌమ్య అతని అవస్థని గమనించి. అజయ్ మౌనంగా తలూపాడు. ఇద్దరూ ఓ ప్రక్కకి వెళ్ళాక— “హ్మ్… ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారూ!” అందామె. “అఁ… సౌమ్యగారూ… మ్మీరు… ఇంకా… ఏం చెప్పలేదు!” అన్నాడతడు ఆఖరుకి. ఊపిరంతా ఎగిరిపోయినట్లయింది ఆ ఒక్క మాటకే… హుఫ్! “ఏం చెప్పాలి?” అందామె ఏమీ ఎరుగనట్లు. “అదేంటి…? నిన్న… న్-నేను… లెహ్-టర్…— ఆ ప్యూన్ మీకు—ఇవ్వలేదా?” “మ్… అతనిచ్చాడూ…!” అంటూ దీర్ఘం తీసి, “ఐతే!” వదిలిందామె. ఆమె వైఖరి చూస్తే కావాలనే అజయ్ ని ఓ ఆటాడుకుంటున్నట్లు అనిపిస్తోంది కదూ! “ఐతే… అదీ…బబ్బదీ…గదీ…యిదీ… ఛ… అంటే… నేను—!” ఎంత వైచిత్రం! క్రిమినల్స్ కి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్ళు తాగించిన వాడు ఇప్పుడీమె ముందు మాట్లాడటానికి నీళ్ళు నములుతున్నాడు. అక్కడ ఆమె ముఖం చూస్తే వస్తున్న నవ్వుని కావాలని ఆపుకుంటున్నట్లు కనిపిస్తోంది. కాస్త ధైర్యాన్ని కూడదీసుకుని మరలా తన గ్రొంతుని సవరించుకుంటూ, “సౌమ్యగారూ!” అని పిలిచాడు అజయ్. “హ్మ్… చెప్పండి ఇన్స్పెక్టర్ గారూ!” అతను మరోమారు గాఢంగా శ్వాసని తీసుకుని వదిలి ఆమె కళ్ళలోకి చూస్తూ, “సౌమ్యగారూ…. నా పేరు అజయ్. నన్ను నా పేరుతో పిలవండి చాలు!” అన్నాడు. “అయ్యబాబోయ్! ఇంకేమైనా వుందా? మీవంటి పెద్దవారిని పేరు పెట్టి పిలవడమే! నా వల్ల కాదండీ!” అందామె వెంటనే. అజయ్ కంగారుగా— “అఁ-అబ్బే-చూడ్డానికి అలా కనిపిస్తున్నానేమోగానీ… న్-నేనంత పెద్దవాడ్నేమీ కాదండీ… అఁ…జస్ట్ ఇ-ఇరవై ఏడేళ్ళే నాకు!” తన చొక్కాని కిందకి లాక్కుంటూ అన్నాడు. సౌమ్యకి అతను అచ్చంగా చిన్నపిల్లవాడికి మళ్ళే అమాయకంగా అన్పించాడు ఆక్షణాన. “సరే… విషయం ఏంటో చెప్పండి!” అందామె. “అదే… మీరు ఏమీ జవాబివ్వలేదు కదా… నా… లెటర్ కి!” “అంటే… ఏమని జవాబీయమంటారు నన్ను!?” అతని సహనాన్ని పరీక్షిస్తూ అడిగిందామె. “అంటే… అంటే… మీకు ఏమని అనిపిస్తుందో— అలాగే… చెప్పేయండి. అంతే!” వెర్రిగా నవ్వాడతను. “అమ్మో! మీకది నచ్చకపోతే మళ్ళా మీ లాఠీని ఎక్కడ పెడతారో మరి!” అంది భయపడుతున్నట్లు నటిస్తూ. “ఛఛ… నేను చచ్చినా అలా అస్సలు చెయ్యను సౌమ్యగారూ…! జరిగినదానికి మీకు ఆల్రెడీ క్షమాపణలు చెప్పాను కదా…!” “ఐనా, ఒకవేళ… మీరు కోరుకున్న జవాబుని నేనివ్వకపోతే?” గుటకపడింది అజయ్ కి. తలదించుకుని ఒక్కక్షణం మౌనంగా ఆలోచించినాక— ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, “నాకు నమ్మకముంది!” అన్నాడు నిజాయితీగా. అతనన్న మాటకి ఇంకా అతన్ని వెయిట్ చేయించడం న్యాయమనిపించలేదు సౌమ్యకి. తన లేఖ ద్వారా అజయ్ అతని మనసుని ఆవిష్కరించిన విధానానికి ఆమె ఎప్పుడో ముగ్ధురాలయింది. ఆమెకే తెలుసు, గతరాత్రి నిద్రపోకుండా తను అతని లేఖను ఎన్నిమార్లు చదివిందో… తన కన్నీళ్ళు ఎంతగా ఆ లేఖను తడిపేసాయో..! ఐనా… అప్పుడే బైటపడటం ఇష్టంలేక— “మనం… స్నేహితులం అవ్వ వచ్చు ఇన్స్పెక్టర్ గారూ!” అంది. “స్నే-హితులమా….?” అంటూ మొహాన్ని వేలాడేశాడు అజయ్. “ఇ-ప్పటికి… మనం స్నేహితులగా వుందాం ఇన్స్పెక్టర్ గారు!” “ఇప్పటికి అంటే… ఆ తర్వాత?!” “చూద్దాం… ఇప్పటికి ఇంతే!” అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం తన చేతిని చాపింది. అజయ్ సంశయంగా ఆ చేతిని అందుకుంటూ, “సరే… నేను వెయిట్ చేస్తాను సౌమ్యగారూ!” అన్నాడు. “సౌమ్య అని పిలవండి… మనం ఇప్పటి నుంచీ స్నేహితులం కదా!” ‘ఎప్పటి వరకో…’ అని మనసులో అనుకుంటూ “ఐతే… నన్ను కూడా పేరు పెట్టి పిలవాలి!” అన్నాడు అజయ్. “ఇప్పుడు కాదు… రాత్రికి మీకు కాల్ చేసి అలాగే పిలుస్తానులెండి!” అంటూ తన చేతిని వెనక్కి తీసుకొని అక్కణ్ణించి తిరిగి నాలుగడుగులు వేసింది. అప్పుడే, అజయ్ కి మైండ్ లో ఒకటి ఫ్లాష్ అయ్యి— “ఆఁ… సౌమ్యా… నిన్న రాత్రి కాల్ చేశారు… నేను లిఫ్ట్ చేసేలోగా కట్ అయిపోయింది!” అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి, “ఎదురుచూస్తున్నాను అన్నారుగా…—” అని అంటూ నునుసిగ్గుతో చిన్నగా నవ్వుతూ, “—లెటర్ లో…!” అని అనేసి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అజయ్ తన బుర్రని గోక్కుంటూ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు.

“ఎగ్జామ్ కి టైం అయిపోతోంది. వీళ్ళింకా రాలేదేమిటి?” టెన్షన్‌తో పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది నాస్మిన్. సెంటర్ లోకి అనుమతించడానికి కేవలం పదిహేను నిముషాలే వుండటంతో నాస్మిన్, సామిర్ లు సుజాత గురించి కంగారు పడసాగారు. “ఐనా… పరీక్ష పెట్టుకొని కూడా వెళ్ళాల్సినంత అర్జెంటు పనేమయివుంటుంది?” అందామె మళ్ళా. సామిర్ కి అంతకుమించిన సందేహాలు, భయాలూ, ఆందోళనలూ వస్తున్నాయి గానీ నాస్మిన్ ముందు వాటిని బైట పెట్టకుండా, “సరే… నీకూ లేటయిపోతోందిగా, నువ్వు లోపలికెళ్ళు!” అన్నాడు. నాస్మిన్ తలాడిస్తూ ఓసారి తన చేతికున్న వాచీని చూస్తూ, “హ్మ్… ఇంకో ఐదు నిముషాలు చూద్దాం—” అని అంటుండగా అప్పుడే శంకర్ బైక్ వారి ముందు ఆగింది. సుజాత ఆ బైక్ మీంచి దూకినట్లుగా దిగుతోంది. నాస్మిన్ రిలీఫ్ గా ఊపిరి తీసుకుని, “సుజీ…!” అంటూ వడివడిగా ఆమె దగ్గరికి వెళ్ళి, “ఇంతసేపూ ఎక్కడికి వెళ్ళిపోయావ్?” అని కోపంగా అడిగి శంకర్ వైపు చూసి, “సార్—” అని ఏదో అనబోతుండగా, “ఎగ్జామ్ కి టైం ఐపోతోంది. తొరగా వెళ్ళండి ఇద్దరూ… మళ్ళా ఎంట్రీ క్లోజ్ చేసేస్తారు. ఏమైనా వుంటే తర్వాత చూద్దాం. ఆల్ ద బెస్ట్!” అని గబగబా చెప్పేసి శంకర్ అక్కణ్ణించి స్టార్ట్ అయ్యాడు. సుజాతని చూసిన సంతోషం వల్లనో మరెందుకనో పరీక్షా సమయం అయిపోతోందన్న విషయాన్ని క్షణంపాటు మరిచిపోయింది నాస్మిన్. శంకర్ గుర్తు చెయ్యగానే తుళ్ళిపడి, “హా… యహ్… అల్లా… యస్ సర్! థాంక్స్… సుజీ… పద వెళదాం!” అని వెనక్కి మరలుతూ అంది. శంకర్ వెళ్ళిపోయాడు. సామిర్ అక్కడే నిల్చుని వున్నాడు. నాస్మిన్ అతన్ని దాటుకొని గాభరాగా సుజాత చెయ్యి పట్టుకుని సెంటర్ వైపు పరుగులాంటి నడకతో నడుస్తోంది. ఆమెకి ఇంకేమీ పట్టించుకునే ధ్యాసలేదు. వెనక నించి, “ఆల్ ద బెస్ట్!” అన్నాడు సామిర్ కాస్త గ్రొంతుని పెంచి. సుజాత వాణ్ని చూసి తన మరో చేత్తో హ్యాండ్ బ్యాగ్ జిప్ ని ఓపెన్ చేసి అందులోంచి మడిచిన కాగితాన్ని ఒకటి తీసి వాడికి కనపడేలా నేల మీద పడేసి కళ్ళతోనే తీసుకొమ్మన్నట్లుగా సైగ చేసింది. సామిర్ ఆ కాగితాన్ని చూసి మళ్ళా సుజాతని చూశాడు. ఆమె అతన్ని చూసి సన్నగా నవ్వుతూ చిన్నగా చెయ్యూపి నాస్మిన్ తో కలిసి సెంటర్ లోకి వెళ్ళిపోయింది.

★★★

“నువ్విక రాజమండ్రికి ట్రాన్సఫర్ చెయ్యించేసుకో అన్నయ్యా! రోజూ కాకినాడ నుంచి వస్తూ పోతూ ఎంత చిక్కిపోయావో చూడు… పాపం!” అని అజయ్ కి భోజనం వడ్డిస్తూ బుగ్గలు పట్టుకుని ముసిముసి నవ్వులు చిందించింది వాణీ. అజయ్ వెంటనే వాణీ చెవిని దొరకబుచ్చుకొని, “నువ్వే సగం నా రక్తాన్ని పీల్చేస్తున్నావే!! ఏదో మా లత చేతి వంట చలువతో ఇంకా ఇలా బతికి ఉన్నానుగానీ—” వాణీ తన చెవిని వదిలించుకొని దూరంగా జరిగి, “అబ్బోస్… అక్కయ్యే కాదమ్మా, నేనూ అద్భుతంగా వండగలను!” అంది తన ముక్కుని గాల్లోకి ఎగరేస్తూ. “ఆమాట నువ్వు కాదు. నీ వంట తిని బ్రతికి బట్టకట్టినవాళ్ళు అనాలి వాణీ!” కుర్చీలో కూర్చుంటూ చల్లగా అన్నాడు శిరీష్. “కరెక్ట్ గురూ!” అంటూ అజయ్ పగలబడి నవ్వాడు. శిరీష్ కూడా అతనితో జత కలిశాడు. వాణీ బుంగమూతి పెట్టి, “బావా!” అంది గారంగా. లత కిచెన్ లోంచి ఏదో కూరని పట్టుకుని వస్తూ, “ఏంటీ అంతలా నవ్వుతున్నారూ—!” అంటూ వాళ్ళని చూస్తూ కళ్ళెగరేసింది. అంతలో అజయ్ ఫోన్ మ్రోగింది. తీసి చూశాడు. ‘సౌమ్య!’ చప్పున లేచి నిల్చున్నాడు. “ఏమయింది అజయ్?” అడిగాడు శిరీష్. “ఏం లేదు గురూ” అంటూ తల అడ్డంగా ఊపుతూ, “సౌమ్య—” అని ఫోన్ స్క్రీన్ ని చూపించి, “రాత్రికి కాల్ చేస్తానని చెప్పింది. నేనే మర్చిపోయాను… ఛ! ఒక్క నిముషం—” అంటూ అక్కణ్ణించి గబగబా బైటకి వచ్చేశాడు. వెనక ఆ ముగ్గురూ ఒకర్నొకరు చూసుకొని నవ్వుకున్నారు, సౌమ్య పట్ల అజయ్ కనబరుస్తున్న (అ)టెన్షన్ ని చూసి.! ముందురోజుకి మల్లే అతను ఎత్తేలోగానే కట్ అయిపోయింది. ఉస్సూరుమంటూ ఫోన్ తో తలని ఓసారి మొట్టుకొని తనే సౌమ్యకి డయల్ చేసాడు. ఒక్క రింగ్ అయ్యీ అవ్వగానే అట్నించి, “హలో!” అంటూ మధురంగా మాట విన్పించిందతనికి. లోపల గుండె తలుపులు ధభాధభా కొట్టేసుకుంటోంటే— “హ్.. హలో… సౌమ్యా!?” అన్నాడు. అతని గొంతు కరుగ్గా కాకుండా చాలా మృదువుగా అన్పించింది అటు సౌమ్యకి కూడా. “హా… సౌమ్యనే మాట్లాడుతున్నాను!” “ఆ…ఆ…హ్… సారీ మర్చిపోయాను. థాంక్స్ ఫర్ కాలింగ్!” “చేస్తానని మాటిచ్చానుగా!” “యస్… థాంక్యూ… థాంక్యూ సోమచ్!” “హుఁ… ఇలా థాంక్సులు చెప్పించుకోటానికేనా నేను కాల్ చేసిందీ!” “స్… సారీ—” “ఒహ్హో— ఇంకేమైనా మాట్లాడండీ!” “సారీ… నేను— అఁ… నాకేం మాట్లాడాలో… తెలీడం లేదు!” అని అజయ్ అనగానే సౌమ్య తియ్యటి నవ్వు సన్నగా అతని చెవులని చేరింది. తన మనసులో ఏదో మెరుపు తీగ తళుక్కుమన్న భావన కలిగిందతనికి. “మీ నవ్వు చాలా బాగుంది!” అనేశాడు. దాంతో, అట్నుంచి బోనస్ గా మరి కొన్ని నవ్వులు విరిశాయి. “మీరూ లెటర్ ని చాలా బాగా వ్రాశారు!” అందామె చివర్న. “థాంక్స్!” చెప్పాడు అజయ్. “అబ్బా… ఇప్పటికి థాంక్సులూ, సారీలూ తప్ప మీరు ఏమీ మాట్లాడలేదు.! అవి కాకుండా మరేమైనా చెప్పండి,” అంటూ మరలా అతన్ని ఆటపట్టించే ధోరణిలో మాట్లాడసాగింది సౌమ్య. అజయ్ క్షణంసేపు ఆగి ఓసారి వెనక్కి తిరిగి ఎవరూ తనకి దగ్గరగా లేరని నిశ్చయించుకున్నాక, “అయ్- లవ్ యూ సౌమ్యా!” అన్నాడు మెల్లగా. ఒళ్ళంతా జివ్వుమన్నట్లు అన్పించింది సౌమ్యకి. అతని నోటి నుంచి ఈమాటని వినటం కోసం ఆమె మనసు ఎంతగా తహతహలాడుతోందో ఆమెకి తెలిసొస్తోంది గాఢంగా శ్వాసని తీసుకుని వస్తున్న నవ్వుని పెదాల చివర్న ఆపుకుంటూ, “ఎలా నమ్మమంటారూ?” అడిగిందతన్ని. “నమ్మకం కలిగేందుకు… నన్నేం చెయ్యమంటారు?!” “ఏం చెప్పినా చేస్తారా?” “తప్పకుండా!” ఒకట్రెండు క్షణాల మౌనం తర్వాత—”ఒకవేళ, చచ్చిపోమంటే… చచ్చిపోతారా?” అందామె. చిత్రమైన సమస్యే! ఇదే ముందరి టఫ్ అయ్యుంటే సమాధానం ఎలా వుండేదోగానీ, ఇప్పుడు అజయ్ ఆమె ప్రశ్నకి సన్నగా నవ్వుతూ, “చచ్చిపోతానులేఁ… మీతో కలిసి ఓ అరవై, డెబ్భయి ఏళ్ళు బ్రతికేసి!” అన్నాడు. చప్పున కళ్ళలో ఆనందపు తడి చేరింది సౌమ్యకి. కళ్ళను ఓసారి మూసుకొని తెరిచి, “అంటే… ఆతర్వాత ఒంటరిగా నన్నొదిలేసి పోతారా?!” అంది కూసింత గోముగా. అజయ్, “ఛఛ… నిన్నూ నాతో కలిసి తీసుకుపోతానుగా!” అన్నాడు కొంటెగా. గలగల నవ్వేసింది సౌమ్య. “మరి… నన్ను జీవితాంతం భరించేంత ఓపిక మీకుందా!” “దానికేం! చాలానే వుంది. రోజూ జిమ్ కి వెళ్తున్నాను కదా!” అన్నాడు అజయ్. ఈసారి మొదలెట్టిన నవ్వుని ఆపటానికి సౌమ్యకి చాలా సమయమే పట్టింది. అజయ్ కొనసాగిస్తూ— “సౌమ్య… నువ్విలా ఎప్పుడూ నవ్వుతూ నా ప్రక్కనే ఉంటే చాలు. నాకు జీవితంలో ఇంక ఏమీ అక్కరలేదు అనిపిస్తోంది!” అన్నాడామెతో. అతని మాటలు తన హృదయాన్ని కరిగించేస్తుంటే సౌమ్య మెల్లగా, “సరే, ఉంటాను!” అనేసింది. “నిజంగా! ఉండిపోతావా నాతో…?” ఉత్సాహంగా అడిగాడు అజయ్. వెంటనే, “అహ్హా… ‘ఇక ఉంటాను’ అంటున్నాను. బాగా లేటవుతోంది కదా! పరీక్షలు దగ్గరపడుతున్నాయి. చదువుకోవాలి!” అందామె తన మాటని మార్చేస్తూ. “ఓహ్… సరే అయితే!” నిరాశగా అంటూ, “ఓకే, గుడ్ నైట్… సౌమ్య,” అన్నాడు. ఆమెతో ఎంతసేపు మాట్లాడినా మరికాసేపు మాట్లాడాలనిపిస్తోందతనికి. నిజానికి, అటు సౌమ్య పరిస్థితి కూడా అలానే వుంది. ఆమె కూడా భారంగా శ్వాసని విడుస్తూ, “గుడ్ నైట్,” అని అతనికి విష్ చేస్తూ చివర్న, “స్వీట్ డ్రీమ్స్… మై డియర్ ఇన్సపెక్టర్!” అనేసి చిలిపిగా నవ్వేస్తూ చప్పున కాల్ ను కట్ చేసేసింది.