నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 19

తన తల్లి అడిగినదానికి ఏమని చెప్పాలో అస్సలు బోధపడటం లేదు సౌమ్యకి. నిజానికి, అదే ప్రశ్నని ఇప్పటికే తనని తాను చాలాసార్లు వేసుకుంది. కానీ, సంతృప్తికర సమాధానం ఏమీ దొరకటం లేదామెకు.

తన బిడ్డ మనసులోని సంఘర్షణను గమనించిన ఆ తల్లి — “చిన్నప్పుడు చంద్రుడిని చూపిస్తూ నీకు గోరు ముద్దలు తినిపించేదాన్ని. ‘అమ్మా! చందమామకి ఆ మచ్చేమిటమ్మా?’ అని అడిగావు నన్నోసారి. అప్పుడు నేనేం చెప్పానో నీకు జ్ఞాపకముందా?” సౌమ్య తనకి గుర్తుంది అన్నట్లు తలూపింది. కానీ, ఎందుకు తన తల్లి ఈ విషయం గురించి ఇప్పుడు అడుగుతుందా అన్నది అర్ధంకాక భృకుటి ముడివేస్తూ — “అఁ… మధ్యన కనిపించే మచ్చనే గమనిస్తే, చుట్టూ వున్న వెలుగుని చూడలేం అని…. చెప్పావు,” అంది మెల్లగా. ఆవిడ చిన్నగా నవ్వుతూ తలూపి, “కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. సరిగ్గా పదహారేళ్ళ క్రితం మీ నాన్నగారు యుద్ధంలో చనిపోయారన్న వార్త విన్న క్షణాన నిరాశా నిస్పృహలు నన్ను పూర్తిగా కమ్మేసినట్లనిపించింది. అప్పుడు నాకు కనిపించిన ఒకే ఒక్క వెలుగు… నా ఒడిలో పడుకుని వున్న నీ చల్లని చిరునవ్వు! ఏ కల్మషం లేని ఆ నవ్వు ఆనాడు నాలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. నన్ను ముందుకి నడిపించింది. ఇప్పుడిలా మన జీవితాలని బాగు చేసింది. నిన్న నువ్వు చూపిన పరిణితిని చూసి నాకెంతో గర్వంగా అన్పించింది. ఎన్ని ఆటుపోట్లు వొచ్చినా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోగలవనే నమ్మకాన్ని నాకు కలిగించింది. కానీ, ఇప్పుడు నిన్ను చూస్తే… మళ్ళా నా ఒడిలో ఆడుకున్న ఆరేళ్ళ పాపాయిలా అనిపిస్తున్నావు!” నవ్వుతూ అందామె. దాంతో, సౌమ్య కాస్త ఉడుకుమోతుగా మొహం పెట్టి, “అమ్మా!” అంది. ఆ పెద్దావిడ మొహం మరికాస్త విప్పారింది. తన కూతురి చేతిని తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని— “ఒక తల్లిగా… నీ మనసులో నెలకొన్న సందిగ్ధతని నేను అర్ధం చేసుకోగలను.” తన చేతిలో వున్న ఉత్తరం వైపు చూస్తూ, “దీని గురించి నేను నీకు ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. ఇది నీ జీవితం. ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలి!” అంటూ మళ్ళా సౌమ్య చేతిలో ఆ వుత్తరాన్ని పెట్టేసింది. సౌమ్య అయోమయంగా తన తల్లిని చూసింది. ఆవిడ కొనసాగిస్తూ— “ఒక్క మాట! ఎవరి జీవితమూ తెరిచిన పుస్తకం కాదు. ఎదుర్కొన్న పరిస్థితులను బట్టీ దేనిమీద ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాకూడదు. నిష్పక్షపాతంగా తార్కికంగా బాగా ఆలోచించి మనసుకు ఏది మంచిదని తోస్తుందో అదే చెయ్యాలి. ఇదే, అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న జీవన పాఠం! చివరగా… నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, నీకు నేను ఎప్పుడూ తోడుగా వుంటాను,” అంటూ మెల్లగా పక్కమీంచి లేచి, “బాగా పొద్దుపోయింది. ఇక పడుకో…” అనేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది.

★★★

“నాస్మిన్! త్వరగా రా… ఎగ్జామ్ కి బయలుదేరుదాం!” బైక్ మీద కూర్చుని కేకేశాడు సామిర్. “ఇంకా చాలా టైముందిగా…!” అంటూ బయటకొచ్చింది నాస్మిన్. నిజమే! రోజూకన్నా చాలాముందే రెడీ అయిపోయాడు సామిర్. మరి అతనికి డబుల్ డ్యూటీ వుంది కదా! “ఎలాగూ సుజాత మనతో రావట్లేదన్నావ్ కదా… ఇంక ఆలస్యమెందుకు చెయ్యటం? నిన్ను ఎగ్జామ్ సెంటర్ లో దింపేసి నా ఫ్రెండ్ రమణ దగ్గరకు వెళ్తాను.!” అంటూ ఆమెను తొందర చెయ్యసాగాడు. నాస్మిన్ కూడ మంచి మూడ్ లో వుండటంతో, “సరే… సరే… వస్తున్నాను!” అంటూ తన బ్యాగ్ పట్టుకుని బయటకొచ్చింది. సామిర్ బైక్ స్టార్ట్ చేసాడు. ఆమె అతని వీపుకి అతుక్కుపోయినట్లుగా కూర్చొని “మ్… పద!” అంది. అప్పుడే, వారి ముందునించి శంకర్ తన బైక్ లో వెళ్ళటం ఆ యిద్దరూ చూశారు. అతని వెనుకే ఓ ప్రక్కకి తిరిగి కూర్చుని వుంది సుజాత!

గబుక్కున ఆగిపోయి వాళ్ళవంక చూస్తూ వుండిపోయాడు సామిర్. అతని బుర్రలో వెంటవెంటనే చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ‘సుజాత… అలా వెళ్ళిపోతోందేంటి? ఏమైవుంటుంది? కొంపదీసి మా ప్లాన్ ఏమైనా తెలిసిపోయిందా? ఐనా… ఎలా తెల్సిపోతుంది?’ నాస్మిన్ కూడ శంకర్ ని, సుజాతని చూసి, “ఓ… వీళ్ళూ త్వరగానే బయలుదేరారుగా. నువ్వాగిపోయావేఁ… పద!” అంది వెనకనించి. సామిర్ తన షాక్ లోంచి బైటకొచ్చి బైక్ ని ముందుకి పోనిచ్చి మెల్లగా శంకర్ బైక్ వెనకాలే కాస్త దూరంలో వెళ్తున్నాడు. అతనిలో పలు సందేహాలు… భయాలు… ఆందోళనలు… అసలేం జరిగి వుంటుందా అని! మరో ప్రక్క నాస్మిన్ అతన్ని షరామామూలుగా తడిమేస్తూవుంది. ఆమెను వారించలేక సుజాతకి దగ్గరగా బండిని తీసుకువెళ్ళలేక దూరంగానే ఉండిపోయాడతను. అటు సుజాత కూడ ముళ్ళకంపమీద కూర్చున్నట్లు చికాగ్గా మొహం పెట్టుకుని బిగుసుకుపోయినట్లు బండి మీద కూర్చొనివుంది. ఆమెనలా చూస్తుంటే సామిర్ లో భయం ఇంకా ఎక్కువవుతోంది. మరికాసేపటికి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చేశారు వాళ్ళు. ఐతే, శంకర్ బండిని ఆపకుండా అలా రోడ్ లో ముందుకి వెళ్ళిపోయాడు, సుజాతతో సహా! సామిర్ కంగారుగా— “అదేంటి… ఆళ్ళాగలేదు. ఎక్కడికెళ్ళి పోతున్నారు?!” అన్నాడు నాస్మిన్ తో. ఆమె కూడ విశ్మయంగా వాళ్ళవేపు చూస్తూ భుజాలెగరేసింది.


‘ఏం జరిగింది?’ అని వాళ్ళిక్కడ అనుకుంటుంటే అక్కడ సుజాత ‘హుఁ… ఇలా ఎందుకు జరిగింది?’ అని తల పట్టుక్కూర్చుంది. పాపం… ముందురోజు రాత్రి తాను శంకర్ సార్ తో కలిసి వస్తానని నాస్మిన్ కి చెప్తున్నప్పుడు సరిగ్గా అలాగే జరుగుతుందని ఆమె ఊహించలేదు మరి! ఇంతకీ అసలు ఏం జరిగిందంటారా…! బెడ్రూమ్లో సుజాత నాస్మిన్ తో మాట్లాడుతున్న అదే సమయంలో అప్పుడే పెరట్లోని బాత్రూంలోకి వెళ్ళిన అంజలికి ఆమె మాటలు చెవినపడ్డాయి. ఆ బాత్రూంకి గల విశేషమైన సౌలభ్యం మీకింకా గుర్తుందనే అనుకుంటున్నాను. ఇంకేముంది! ‘రూంలో మాట్లాడేది ఇక్కడ వినిపిస్తుందా?’ అనుకుంటూ అవాక్కయిన అంజలికి సుజాత శంకర్ తో కలిసి వెళ్తానన్నడం డబుల్ షాక్ నిచ్చింది. శంకర్ అంటే కోపంతో విరుచుకుపడే సుజాత అలా ఎందుకు చెప్తోందో ఆమెకి అర్ధం కాలేదు. ఇంకా ఏం అంటుందో విందామని అక్కడే కాచుకున్నా తర్వాత వాళ్ళు మరేమీ మాటాడుకోలేదు. చివరకి నాస్మిన్ అక్కణ్ణించి వెళ్ళిపోయాక సుజాతని శంకర్ సమక్షంలో ఆ విషయమై నిలదీసిందామె. ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయింది సుజాతకి. ‘తన పిన్ని చాటుగా తమ మాటల్ని వింటోందా?’ అన్న శంక ఆమె మనస్సులో వ్యక్తమైంది. ఆమె ఎంతవరకూ విన్నదో తెలియదు. అడిగే ధైర్యం లేదు. దాంతో, గ్రొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయి ఫీలయ్యింది. ఐతే, సామిర్ గురించి తాము మాట్లాడుకున్నదాని గురించి తన పిన్ని అస్సలు ప్రస్తావించకపోవటంతో ఆమె తమ మాటలను పూర్తిగా వినలేదని నిశ్చయానికొచ్చిన తర్వాత పాదరసంలాంటి ఆమె బుర్రకి వెంటనే తక్షణోపాయం తట్టింది. చప్పున తలెత్తి, “కావాలనే నాస్మిన్ తో అలా చెప్పానమ్మా!” అంది. శంకర్, అంజలి ప్రశ్నార్థకంగా సుజాతని చూశారు. “నాకితనిపైన నమ్మకంలేదు. నాన్నని విడిపించటానికి నిజంగా ప్రయత్నం చేస్తున్నాడో లేకపోతే ఇంకా పెద్ద శిక్ష వెయ్యటానికి ట్రై చేస్తున్నాడో…? అందుకే, రేపు నేనూ అతనితో లాయర్ దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను. అంతా కనుక్కున్నాక అక్కడే సంతకం పెడతాను,” అంటూ అలవోకగా అబద్ధపు గోడను కట్టేసిందామె. అంజలి కోపంగా, “నోర్మూయ్ సుజీ… ఏమ్మాట్లాడుతున్నావ్ నువ్వు! పిచ్చి పట్టిందా నీకు—” అంటూ అరిచింది. శంకర్ మధ్యలో కల్పించుకొని, “పర్లేదు అంజలిగారు. తను చెప్పినట్లు రేపు తనని తీసుకెళ్ళటంలో నాకేం అభ్యంతరం లేదు!” అన్నాడు. దానికి అంజలి, “అది కాదు… ఓప్రక్క పబ్లిక్ పరీక్షలవుతుంటే యిప్పుడు ఇదంతా అవసరమా?” అంటూ కోపగించుకుంది. వెంటనే, “నాకు నాన్న కన్నా ఏదీ ఎక్కువ కాదు!” అంటూ కట్టిన గోడకి సెంటిమెంట్ పూతేసింది సుజాత. ఆఖరుకి శంకర్ ‘సరే సుజీ… ఓ పని చేద్దాం! రేపు పొద్దున్నే నిన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి మరలా పరిక్ష టైంకల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపేస్తాన’నని చెప్పేయటంతో నాస్మిన్ తో తను సరదాగా చెప్పిన అబద్ధం ఇలా నిజమై కూర్చుంది. బహుశా… దీన్నే తధాస్తు దీవెనలని అంటారేమో!

★★★

ఇక రాజమండ్రిలో— తన తల్లి ఇంటిలోనికి వెళ్ళిపోయాక, ఆవిడ చెప్పిన పలు విషయాలలో అంతర్లీనంగా కానవస్తున్న వివరాలను గ్రహించేందుకు ప్రయత్నిస్తోంది సౌమ్య మనసు. అమ్మతో సంభాషించాక తనలోని అనిశ్చితికి కొంతవరకు స్వాంతన లభించిందామెకు. చల్లగా వీస్తున్న గాలికి తన చేతిలోని లెటర్ రెపరెపలాడుతుంటే దాన్ని రెండు చేతులతో పట్టుకుని చూసింది. అందులోని ప్రతి మాట తను చూసిన కరుకు మనిషిని సరికొత్తగా పరిచయం చేస్తుంటే మరోమారు ఆ లేఖని చదివింది. అలా ఆమె చదువుతుండగా… ఒకచోట, ‘…నీ చిరునవ్వు నా జ్ఞాపకంలో లిప్తకాలం మెదిలి నా మనసుకు కొత్త వూపిరిలూదింది. ఆ క్షణం నాకు అర్ధమైంది. నా జీవితానికి సరికొత్త నిర్వచనం నువ్వని… నీ చిరునవ్వని…!’ ఆ పంక్తిని చదవగానే తన తల్లి తనతో అన్నది చప్పున జ్ఞాపకం వచ్చిందామెకు. ‘… అప్పుడు నాకు కనిపించిన ఒకే వెలుగు ఒడిలో పడుకున్న నువ్వు… నీ చిరునవ్వు!’ సౌమ్య కళ్లు విశాలమయ్యాయి. అసంకల్పితంగా ఆమె మొహంలో చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది.! ఆ తర్వాత — ‘ఒక్కసారిగా అంపశయ్య మీంచి అమ్మ ఒడిలోకి మారినట్టు ఆ క్షణం వరకూ నా గుండెల్లో పరుచుకొన్న అలజడంతా ఆవిరై అవ్యక్తమైన ఆనందపు అలికిడితో మనసంతా నిండిపోయింది.’ అన్నది చదవగానే మనసు బరువెక్కిన భావన కలిగి కళ్ళు చెమ్మగిల్లాయి. రాతి హృదయమనుకున్న మనిషిలో ఇంతటి భావుకత నిండివుండటం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఏ మనిషినీ ఎదుర్కొన్న పరిస్థితులను బట్టీ అంచనా వెయ్యకూడదన్న తన తల్లి మాటల్లోని మర్మం ఆమెకు అర్ధమవసాగింది. చివరగా ఒక నిర్ణయానికి వచ్చి తన దిండుక్రింద వున్న ఫోన్ ని తీసింది.