హనీమూన్

ఆషాఢ మాసంలో ‘హనీమూన్’కు వెళ్దామని మరోసారి ప్రతిపాదించాను, నా భార్య వాగ్దేవి వద్ద.

ఉహుఁ, ససేమిరా ‘వద్దు’ అంది ఆమె, మళ్లీ.

చిరాకు ప్రదర్శించాను. ఆమె పట్టించు కోలేదు.

ఆమె నుండి కాస్త దూరంగా జరిగాను మంచం మీదనే.

ఆమె చిన్నగా నవ్వింది. కాసేపు ఆగి అంది: “నష్టపోయేది ఎవరు?” అని.

నేనేమీ మాట్లాడలేదు.

“మా అన్నయ్య, వదిన వచ్చి ఉన్నారుగా. రేపే నా ప్రయాణం. ఆషాఢం అయ్యేకే మళ్లీ తిరిగి వచ్చేది” అని చెప్పింది ఆమె, నా వైపు కాస్తంత ఒత్తిగిల్లి.

నేను దీనంగా చూశాను ఆమె చూపుల్లోకి.

“మరో నెల తర్వాతే, నేను మళ్లీ ఇక్కడకు వచ్చేది” అంది ఆమె చిన్నగా. నేను మెత్తబడిపోయాను.

“రుచులన్నీ చవి చూపి ఇలా ఏడిపించడం బాగోలేదు” గునుస్తున్నట్టు అన్నాను, ఆమెకు దగ్గరగా చేరిపోయి.

“లేదు. భార్యాభర్తల అనుబంధంలో ఇన్నిన్ని రకాలయిన రుచులుంటాయని అనుభవంతో తెలుసుకోగలుగుతున్నాం మనం, ఒకరికొకరం, ఈ మధ్యన. కాదా?” అంది ఆమె నన్ను గట్టిగా వాటేసుకొని.

నేను ఆమె పెదాల మీద ముద్దు పెట్టాను. ముద్దు సవ్వడి పిమ్మట, కొద్దిసేపు మా మధ్యన నిశ్శబ్దం.

సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. ప్యాన్ కాస్తా ఆగిపోయింది. గదిలో గాలి ఆడడం లేదు. ‘మస్కిటోస్ కాయల్’ పొగ ఘాటు స్పష్టంగా తెలుస్తోంది.

మంచం దిగాను. ఆ గది కిటికీ తలుపులు తెరిచాను. బైట మసక వెలుతురు. ఆగి ఆగి గాలి వస్తోంది.

“బైటకు వెళ్దాం రండి” అందామె మంచం దిగి.

గది తలుపు తీశాను.

ఇద్దరం గదిలోనించి బయటకు వచ్చాం.

మాది రెండంతస్తుల ఇల్లు. పై అంతస్తులో ఒకే ఒక గది. అటాచ్డ్ బాత్రూంతో ఉంటుంది. ఆ గదిలోనే నేను, వాగ్దేవి గత నాలుగు రాత్రులు గడిపాం.

ఆ గది బయట, మిగతా ఖాళీ జాగాలో – మధ్యన ‘ఎస్’ ఆకారంలో ఒక సిమెంటు కుర్చీ ఉంటుంది. దానిలో అటుఇటుగా ఇద్దరు ప్రక్కప్రక్కన కూర్చునట్టు కూర్చోవచ్చు. ఆ కుర్చీకి దగ్గరగా చుట్టూ పూల మొక్కలు కుండీలు పేర్చబడి ఉంటాయి. వాటి నడుమ, ఆ కుర్చీలో కూర్చుంటే ఏదో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

వాగ్దేవి ఆ కుర్చీలో ఒక వైపున కూర్చుంది. వెంటనే అంది – “అబ్బ కాల్తోంది” అని.

“ఉదయం ఎండతో బాగా వేడెక్కి ఉంటుంది” అంటూనే నేను గదిలోకి వెళ్లాను. ఒక దిండుతో తిరిగి వచ్చాను. “లే” అంటూ ఆమెను కుర్చీలోనించి లేపి, దానిలో చేతిలోని దిండును వేసి, తిరిగి కూర్చోమన్నాను. ఆమె అలాగే చేసింది.

“చాలా థాంక్సండీ” అంది. “ఈ మీ అనురాగం జీవితాంతం నాకు లభిస్తుండాలి” అని కూడా అంది ఆమె వెంటనే – నా కుడి చేయిని తన చేతుల్లోకి తీసుకొని నొక్కుతూ.

నేనెంతో కదిలిపోయాను.

ఆమె ఎడమ చేయిమీద ముద్దు పెట్టుకున్నాను. తరువాత ఆమె చెవి వద్దకు మొహంను పోనిచ్చి చెప్పాను: “నువ్వు కావాలి; నువ్వే కావాలి, ఎప్పటికినూ”

ఆమె నా భుజంపై తలను ఆన్చింది.

ఆగి అంది, “మనం పెళ్లి వలన దగ్గరై, పది రోజులే ఐనా మనది ఎన్నాళ్లోనాటి బంధంలా ఉంది” అని.

“అవును. నువ్వు అన్నట్టు పెళ్లితో ఏర్పడిన అనుబంధం మా గొప్పదిస్మీ.” అన్నాను.

ఆమె మరింతగా నా వైపుకు ఒరిగింది.

“నిన్ను విడవడానికి మనస్సు ఒప్పుకోడంలేదు”

“మీరు ముందుగా చెప్పారు. నాదీ డిటో”

“అందుకే మనం ఈ ఆషాఢంలో …”

ఆమె వెనువెంటనే అడ్డు తగిలి, “వద్దు, ఆ హనీమూన్ ప్రస్తావన మాత్రం వద్దు” అని అంది.

నేను ఢీలా పడిపోయాను, మళ్లీ.

దూరానా అటు ఆకాశంలో మెరుపుల వెలుగు ఉండుండి అగుపిస్తోంది. గాలి వడి పెరుగుతోంది. అయినా గాలిలో వేడి తగ్గలేదు.

“నువ్వు అర్థం కావడం లేదు నాకు” అన్నాను.

“ఎలా ఎలా” అంది ఆమె ఆసక్తికరంగా.

“నిజం. నిజానికి నేను అనుకున్నది వేరు. పెళ్లి చూపులంటే – మగ పెళ్లి వారు రావడం, ఆడ పెళ్లివారి పెద్దలు ఆహ్వానించడం, ఆదరించడం, పిమ్మట అమ్మాయిని తీసుకువచ్చి చూపించడం, ఇలాగే జరుగుతోంది పెళ్లి చూపుల తంతు అని అనుకున్నాను. కానీ మన పెళ్లి చూపులు మాత్రం మరోలా జరిగాయి” అన్నాను నేను.

“అవును. మీరు రాగానే నేనూ ఎదురు వచ్చాను. మా వాళ్లతో పాటే మీ ముందు కూర్చున్నాను. మాట్లాడాను. మీకు టిఫిన్లు, కాఫీలు అందించాను. మీరు తిరిగి వెళ్లేటంత వరకు మీ దగ్గరే ఉన్నాను” చెప్పిందామె చలాకీగా.

“అవును. అదో కొత్త అనుభూతి” అన్నాను నేను.

“కావచ్చు, పెళ్లి చూపుల కార్యక్రమం ఒక సహజమైన ఘట్టం. అదొక తతంగంలా ముగిసిపో కూడదు. ప్రత్యేకమైన అలంకరణతో, ఇబ్బందికరమైన కదలికలతో అది కొనసాగ కూడదు. సాదాసీదాగా, సహజ రీతిలో అది సాగిపోతేనే బాగుంటుంది. అక్కడ అవగాహనకు, నిజాయితీ ఆసరా ఐతే బాగుంటుంది. ఇవన్నీ మొదట నా ఊహలో అయినా, స్వీయానుభవంతో ఇవన్నీ ఖచ్చితంగా ఆహ్లాదపరిచేవి, ఆరోగ్యకరమైనవి అని నొక్కి చెప్పగలుగు తున్నాను. ఏదైనా ముందు చూపు, కాస్తా తెగింపు జత చేస్తే అన్నీ తర్వాత గొప్పవే” అంది ఆమె.