బ్లూ ఫిల్మ్ – Part 3

ఓకే. ఓకే. ఒకే…నో ఎక్సప్లనేషన్ నౌ…” నా మాటలని కట్ చేసాడు సుభాష్. “మీరిద్దరూ నాకు ఎవరికి వారే రెండు ఆసక్తికరమైన మనస్తత్వాల్లా కనిపించారు. నాకు ఉషదో పెద్ద ఇంటిమెసే లేదు కానీ వీడు నాకు బాగా తెలుసు. ఐతే ఉష గురించి నేను విన్నదీ, చూస్తున్నదీ, మాట్లాడినప్పుడు అర్ధమయిందీ అంతా కలిపి ఆలోచిస్తే-ఒక కోణంలో ఇద్దరూ మేధావులేననిపిస్తుంది. ఒక కోణంలో ఇద్దరూ మూర్ఖులే అనిపిస్తుంది.

ఒక్కోసారి మీ మాటలు వింటుంటే-ఆకాశమంత ఎత్తు ఎదిగిన చైతన్య శిఖరాల్లా కనిపిస్తారు. ఒక్కోసారి మీ జీవనవిధానం, మీ చర్యలు గమనిస్తే పాతాళకూపంలో కూరుకుపోయిన పిగ్మీల్లా కనిపిస్తారు. మీ ఇద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేయటంలో నా ఉద్దేశ్యం ఏమిటంటే— ఉష వలన అభినయ్ కి, అభినయ్ వలన ఉషకీ…పరస్పరం ఏదో గొప్ప ప్రయోజనం కలుగుతుందనీ, ఒక సంచలనాత్మక పరిణామానికి నాంది అవుతుందనీ, ఏదో ఒక అద్భుతం జరుగుతుందనీ.

నేననుకున్నది జరగకపోయినా, ఒకరి వలన ఒకరికి ఎటువంటి నష్టం జరగదని నాకు సంపూర్ణ విశ్వాసం! నేను మీకు మనవి చేసేది ఒక్కటే! ఈ క్షణం నుంచి సుభాష్ ని మర్చిపోండి! ఏ క్షణంలోనయినా నేను గుర్తుకొస్తే అది పాజిటివ్ థాట్ అయ్యుండాలే తప్ప—నన్నెప్పుడూ తిట్టుకోకండి, శపించకండి—ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మీ జీవితాల్లో జరిగే ఏ సన్నివేశాలకయినా, ఏ మలుపులకయినా, ఏ పర్యవసానాలకయినా—మీరే బాధ్యులు సుమా!” అన్నాడు సుభాష్ గంభీరంగా.

వాడింత గంభీరంగా ఉపన్యసించ గలడని ఆ క్షణంలోనే తెలిసింది. వాడి సంకల్పంలోని పవిత్రత నాకెంతో నచ్చింది. “నాకో మంచి ఫ్రెండ్ ని పరిచయం చేసినందుకు థాంక్స్…” అన్నాను వాడిని కౌగిలించుకుంటూ. “నేను మంచి ఫ్రెండ్ నని ఎందుకనుకుంటున్నారు అభినయ్ గారు! మీకు నా గురించి ఏమీ తెలీదు కాబట్టీ అలా అనిపిస్తుంది. సుభాష్ గారి సమక్షంలో మీకు నాగురించి ఒక నిఖార్సయిన నిజం చెప్పాలనుకుంటున్నాను” అందామె.

“ఏమిటది?” అన్నాడు సుభాష్. “అయామ్ ఎ బ్యాడ్ గర్ల్. ఉష అనే నేను చాలా చెడ్డ అమ్మాయిని తెలుసా?” అంటోందామె. నేనూ, సుభాష్ ఏకకాలంలో పగలబడి నవ్వేసాం. “వండ్రఫుల్! నేను బ్యాడ్ గర్ల్ నని నిజాయితీగా తనంతట తానే ఒప్పుకోవటంతోనే పాపప్రక్షాళనమైపోతుందని పెద్దలంటారు. నిజమైన బ్యాడ్ గర్ల్ కి తను బ్యాడ్ గర్ల్ అని తెలీదు, తెలిసినా ఒప్పుకోదు. కాబట్టి-ఐ సర్డిఫై…ఉషా ఈజ్ ఎ గుడ్ గర్ల్” అన్నాడు సుభాష్.

అదే క్షణంలో ఆ ఇంటి నౌకరు వచ్చాడు. వాడి చేతిలో ఒక సూట్ కేసు, ఒక బ్రీఫ్ కేసు వున్నాయి. “ఓరినీ! నాదెందుకు తెచ్చావురా? ఈ బ్రీఫ్ కేసొక్కటే తెమ్మన్నానుగా?” అన్నాడు సుభాష్. వాడి చేతిలోంచి నా బ్రీఫ్ కేసు అందుకుని నాకందిస్తూ. “విష్ యు ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ” అన్నాడు. అప్పుడన్నదామె.

“నన్ను పరిచయం చేసినందుకు అభినయ్ గారు థాంక్స్ చెప్పారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా?” “ఏమిటి?” “జీవితంలో మొట్టమొదటిసారి ఒక మగాడిని చూడగానే—అతని ఛాతీమీద తలవాల్చి పడుకోవాలనిపించేంత ఇంట్రెస్టింగ్ ఇన్*స్పిరేషన్ కలిగింది ఇతన్ని చూడగానే. థాంక్స్ ఫర్ దట్” అంది. నా గుండె అట్టడుగున హఠాత్తుగా ఏదో తలుపు తెరుచుకున్నట్లు గమ్మత్తయిన ఫీలింగ్ కలిగింది.